రాజకీయాల్లోకి వచ్చాక తిట్లు తిట్టకపోతే మనుగడ సాగించడం చాలా కష్టం. రాజకీయాల్లోకి రావాలంటే ఏ డిగ్రీలూ అవసరంలేదు. అక్షరం ముక్క రాకపోయినా ఏం కాదు. అది అవమానకరం కాదు. కానీ వీరలెవల్లో అధినేతలను పొగడటం రావాలి. ప్రత్యర్థులను విపరీతంగా బూతులు తిట్టడం రావాలి. ఈ రెండు పనులు చేయని వారు రాజకీయాల్లోకి రావడం దండగ. వాళ్ళను ఎవరూ పట్టించుకోరు.
వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి రాకముందు ఎలా ఉండేదో మనకు తెలియదు. అన్న జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేయడం ఒక్కటే జనాలకు తెలుసు. ఆ తరువాత తెరచాటునే ఉండిపోయింది. కానీ కొంతకాలం కిందట తెలంగాణలో రాజకీయపార్టీ పెట్టిన తరువాతనే షర్మిల కూడా ఇతర రాజకీయ నాయకుల మాదిరిగానే పరుషంగా మాట్లాడగలదని, ఆమెకు తిట్లు కూడా బాగానే వచ్చని అర్ధమవుతోంది.
ఇతర రాజకీయ నాయకుల దారిలోనే ఆమె కూడా నడుస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ ను బాగానే తిడుతోంది. కేసీఆర్ కూడా అదే టైపు కదా. ఆయన కూడా ప్రతిపక్ష నాయకులను వెనకా ముందు చూసుకోకుండా బాగానే తిడతారు కదా. షర్మిల కూడా అదే భాషలో ఆయనకు వాతలు పెడుతోంది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం -రాష్ట్రం మధ్య రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా.
ఇందులో తలా దూర్చిన షర్మిల కేసీఆర్ ను టార్గెట్ చేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైరవుతోంది షర్మిల. సిగ్గు లేదు.. దద్దమ్మ… ఇంగితం లేదు.. రైతు ద్రోహి.. ఇవన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు. కేసీఆర్, కేటీఆర్ ఇలాఖాల్లో రైతుల ఆత్మహత్యలు సిగ్గుచేటని అన్నది.
రైతు ఆవేదన యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించింది ఆమె. గంభీరావు పేటలో మాట్లాడుతూ.. కేటీఆర్కు కనీసం ఇంగిత జ్ఞానం లేదని మండిపడింది. రైతులకు పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించింది. రుణమాఫీ ఇంకా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించింది. అధికారం అనుభవిస్తే సరిపోదని బుద్ధి, సిగ్గు ఉండాలంది. సీఎం కేసీఆర్ రైతు ద్రోహి అని, రైతుల ఆత్మహత్యలకు ముఖ్యమంత్రే కారణమని షర్మిల ఆరోపించింది.
వరి వద్దని చెప్పే అధికారం సీఎంకు లేదన్నది. మద్దతు ధర ఉన్న పంటలనే రైతు పండిస్తారని, వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకు వద్దన్నది. కేసీఆర్ సీఎంగా పనికి రారని, చావు డప్పు కేసీఆర్కు, ఆయన ప్రభుత్వానికి కొట్టాలన్నది. ఇవి ఆత్మహత్యలు కావని, కేసీఆర్ చేసిన హత్యలని వైఎస్ షర్మిల చెప్పింది. మీ సత్తాలేని పాలన వల్లే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని… ఇంగితం ఉంటే రైతులను ఆదుకోవాలని అన్నది.
ఎమ్మెల్యేని, మంత్రిని, కాబోయే సీఎంనని చెప్పుకోవడానికి సిగ్గుండాలని అన్నది. షర్మిల ఇంత ఘాటుగా మాట్లాడుతోంది కాబట్టి రాజకీయ నాయకురాలిగా పూర్తి అర్హత సంపాదించినట్లే. తనను ఎవరూ పట్టించుకోకపోయినా పార్టీ పెట్టింది కాబట్టి తన పని తాను చేసుకుపోతోంది.