టి సుబ్బరామిరెడ్డి, విశాఖను తన సొంతిల్లు చేసుకున్న నెల్లూరు రెడ్డి గారు. ఆయన ఎనభై దశకంలోనే విశాఖలో సెటిల్ అయిపోయారు. ఇప్పటికీ ఆయన పుట్టిన రోజుతో పాటు మహా శివరాత్రి వేడుకలు విశాఖ వేదికగానే ప్రతీ ఏటా గొప్పగా నిర్వహిస్తారు.
అటువంటి రెడ్డిగారు జగన్ ఆలోచన భేష్ అంటూ మద్దతు ఇస్తున్నారు. విశాఖను రెడీమేడ్ రాజధాని అని చెబుతూ హైదరాబాద్ తో పోటీ గల సత్తా ఒక్క విశాఖకే ఉందని రెడ్డి గారు అంటున్నారు.
విభజన వల్ల అన్నీ కోల్పోయినా విశాఖ వంటి నగరం ఉండడం గొప్ప విషయం అన్న రెడ్డి గారు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే కనుక రానున్న పదేళ్ళలో దేశంలో నంబర్ వన్ మెగా సిటీగా మారడం ఖాయమని విశ్లేషించారు.
విశాఖ ఎందరినో పారిశ్రామికవేత్తలను పరిచయం చేసిందని టీఎస్సార్ చెప్పుకొచ్చారు. రాజధాని కనుక అయితే విశాఖలో పరిశ్రమలు, పెట్టుబడులు పెద్ద ఎత్తున వెల్లువలా వస్తాయని కూడా ఆయన అంటున్నారు.
మూడు రాజధానుల వల్ల ఏపీ బాగుపడుతుందని, అభివ్రుధ్ధి అంతటా విస్తరిస్తుందని జగన్ సర్కార్ విధానాలకు ఆయన జై కొట్టేసారు.
అంతే కాదు, అమరావతిని అభివ్రుధ్ధి చేయడం కంటే అన్ని వనరులు ఉన్న విశాఖను రాజధాని చేసుకోవడం ఉత్తమమని కూడా తన అభిప్రాయాన్ని పక్కా క్లారిటీగా చెప్పేశారు.
విశాఖ రాజకీయాల్లో సీనియర్ గా ఉన్న రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున రెండు సార్లు విశాఖ ఎంపీగా గెలిచారు. ఇపుడు మూడవసారి రాజ్యసభ సభ్యునిగా ఉంటూ విశాఖ నుంచే తన ప్రాతినిధ్యం అని గట్టిగా చెప్పే టీఎస్సార్ విశాఖకు జై కొట్టడం మంచి పరిణామం అని మేధావులు కూడా అంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా కాంట్రాక్టర్ గా తన జీవితాన్ని ఆరంభించిన రెడ్డి గారు విశాఖ అభివ్రుధ్ధిలో తన వంతు పాత్ర పోషించారు. అలాంటి పెద్దాయన దీవెనలు ఉన్నాయంటే విశాఖ రాజధాని ప్రగతి ఎక్కడికో దూసుకుపోవడం తధ్యమన్న మాట అంతటా వినిపిస్తోంది.