బాలీవుడ్ లో మరో పెళ్లి.. ఈసారి హృతిక్?

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి. కత్రినా కైఫ్ పెళ్లి నుంచి చూసుకుంటే, మినిమం గ్యాప్స్ లో బాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. అలియా భట్, అతియా శెట్టి,…

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో పెళ్లిళ్లు జోరుగా సాగుతున్నాయి. కత్రినా కైఫ్ పెళ్లి నుంచి చూసుకుంటే, మినిమం గ్యాప్స్ లో బాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. అలియా భట్, అతియా శెట్టి, కియరా అద్వానీ, స్వరభాస్కర్.. ఇలా వరుసగా ముద్దుగుమ్మలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

అయితే ఇవన్నీ ఒకెత్తు, ఈ ఏడాది జరగబోయే పెళ్లి మరో ఎత్తు. అది ఎవరిదో కాదు, బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ పెళ్లి. అవును.. హృతిక్ ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకుంటాడట. ప్రస్తుతం ఇదే బాలీవుడ్ హాట్ టాపిక్.

కొన్నేళ్లుగా నటి, గాయని సబా ఆజాద్ తో డేటింగ్ చేస్తున్నాడు హృతిక్ రోషన్. ప్రారంభంలో గుంభనంగా సాగిన వీళ్ల వ్యవహారం తర్వాత పబ్లిక్ అయింది. ప్రస్తుతం హృతిక్ ఎక్కడుంటే సబా అక్కడ కనిపిస్తోంది. అంతేకాదు, మీడియా సమక్షంలోనే ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు.

ఈ క్రమంలో ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని హృతిక్-సబా నిర్ణయించుకున్నారట. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ఇరు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు టాక్. ప్రస్తుతం చేతిలో ఉన్న కమిట్ మెంట్స్ పూర్తయిన వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడట హృతిక్. పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు గ్యాప్ కూడా తీసుకోవాలనుకుంటున్నాడట.

అయితే హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ మాత్రం ఈ వ్యవహారంపై స్పందించలేదు. వాళ్లిద్దరూ కలిసి ఉంటున్నారనే విషయం అందరికీ తెలుసని, పెళ్లి గురించి మాత్రం తనకు తెలియదని కామెంట్ చేశారు.

అయితే నిప్పు లేనిదే పొగరాదు. మరీ ముఖ్యంగా హృతిక్ విషయంలో లీకులు లేనిదే న్యూస్ రాదనేది అందరికీ తెలిసిందే. మొదటి భార్య సుజేన్ ఖాన్ కు విడాకులిచ్చినప్పుడు కూడా 2 నెలల పాటు లీకులిచ్చాడు హృతిక్. ఇప్పుడీ రెండో పెళ్లి వ్యవహారానికి సంబంధించి కూడా లీకుల పర్వం మొదలైందంటున్నారు బాలీవుడ్ మీడియా జనం.