క‌విత అరెస్ట్ త‌ప్ప‌దు!

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా? అనే ప్ర‌శ్న‌కు…. త‌ప్ప‌ద‌నే స‌మాధానం వ‌స్తోంది. అది కూడా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెప్ప‌డం అనుమానాల‌కు తావిస్తోంది.…

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా? అనే ప్ర‌శ్న‌కు…. త‌ప్ప‌ద‌నే స‌మాధానం వ‌స్తోంది. అది కూడా కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ నేత‌లు ప‌దేప‌దే చెప్ప‌డం అనుమానాల‌కు తావిస్తోంది. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత పేరున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఢిల్లీ ఆప్ మంత్రి సిసోడియాతో పాటు ప‌లువురు తెలుగు ప్ర‌ముఖుల‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో క‌విత అరెస్ట్ త‌ప్ప‌ద‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతోంది. ఈ ప్ర‌చారానికి బీజేపీ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కామెంట్స్ మ‌రింత బ‌లం క‌లిగిస్తున్నాయి. శ‌నివారం ఆయ‌న తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో రేపో, మాపో క‌విత అరెస్ట్ అవుతుంద‌ని జోస్యం చెప్పడం గ‌మ‌నార్హం. తెలంగాణ‌లో ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ లేద‌న్నారు. కుటుంబ పాల‌న న‌డుస్తోంద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

బీఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మునుగోడు ఉప ఎన్నిక ల్లో బయట పడిందన్నారు. వ్యతిరేకతను దృష్టి మళ్ళించేందుకే టీఆర్ఎస్ కాస్త‌ బీఆర్‌ఎస్ అయ్యిందని రాజ‌గోపాల్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీపై అసత్య ప్రచారం చేశారని ఆయన మండిపడ్డారు. 

తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. గ‌తంలో రాజ‌గోపాల్‌రెడ్డి అమ్ముడుపోయిన‌ట్టు మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న తిరుమ‌ల కేంద్రంగా కీల‌క కామెంట్ చేశారు.

‘శ్రీవారి సాక్షిగా చెబుతున్నా.. నేను ఎవరికీ అమ్ముడుపోలేదు. నేను అవినీతి చేసి ఉంటే కేటీఆర్ , రేవంత్‌రెడ్డి నిరూపించాలి’ అని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. రాజ‌కీయ స‌వాళ్లు ఎలా వున్నా క‌విత అరెస్ట్ అవుతుందంటూ బీజేపీ మైండ్ గేమ్‌కు తెర‌లేపింది. ఇటీవ‌ల కేంద్ర‌మంత్రి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇదే ర‌క‌మైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దాన్ని బీజేపీ నేత‌లు కొన‌సాగిస్తున్నారు.