చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఏం చేసినా… ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అందరిలా చేయడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం వుండదు. తనకంటూ ప్రత్యేకత వుండాలనేది ఆయన మనస్తత్వం. తన నియోజకవర్గ ప్రజలందరికీ కరోనా సమయంలో ఆనందయ్య మందు తయారు చేయించి, ఉచితంగా పంపిణీ చేసి ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక తన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రేమాభిమానాలు ప్రదర్శించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.
ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు. తన ఆరాధ్య నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు ముందస్తు ప్రణాళిక రచించారాయన. ఇందులో భాగంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయ ఆవరణలో గోశాల ముందు భాగంలో ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్ విధానంలో గ్రాస్‌పై సీఎం వైఎస్ జగన్ ముఖ చిత్రాన్ని చక్కగా తీర్చిదిద్దించారు.
వంద అడుగుల పొడవు, వంద అడుగుల వెడల్పుతో 2డీ ఆర్కిటెక్చర్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దేశంలోనే తొలి ఆర్గానిక్ ఆర్ట్ ఫార్మింగ్‌గా చెబుతున్నారు. ఈ ముఖ చిత్రాన్ని ప్రముఖ చిత్రకారుడు కాంత్ రీషా వేశారు. ఇందుకోసం పది రోజుల సమయం పట్టినట్టు సమాచారం. తన నాయకుడికి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పేందుకు గత పదిరోజులుగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్కడే ఉండి, స్వయంగా పర్యవేక్షించడం విశేషం.
ఇంతటితో చెవిరెడ్డి ఆగలేదు. సీఎంపై ‘అధిపతి’ టైటిల్‌తో చక్కటి పాటను ఆవిష్కరింపజేశారు. ‘వర్థిల్లు.. వెయ్యేళ్లు’ పాట ఆడియో సీడీని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా చెవిరెడ్డి విడుదల చేశారు. ఈ పాటను ఎం.కృష్ణవేణి రాయగా, ప్రముఖ సినీ గాయకుడు కారుణ్య ఆలపించారు. కార్తీక్ సంగీతమందించారు. భాస్కర్‌రెడ్డి అంటే జగన్‌కు ఎందుకంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రేమ ఇస్తే, అది తిరిగి వస్తుందని చెవిరెడ్డికి బాగా తెలుసు.