ఎన్నికలకు వెళ్లేందుకు ఏ సమస్యా లేకపోవడంతో కుటుంబాన్ని బజారుకీడ్చి, ఏడుపు ఎపిసోడ్ మొదలుపెట్టి నానా హంగామా చేశారు చంద్రబాబు. ఇటు పవన్ కల్యాణ్ కి కూడా సరైన సబ్జెక్ట్ దొరక్క.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంటూ హడావిడి చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకంటూ.. ఏపీలో మూల మూలన అందరితో ప్లకార్డులు పట్టించి వాటిని సోషల్ మీడియాలో పెట్టించి ఎక్కడలేని హైప్ ఇస్తున్నారు.
అంతా బాగానే ఉంది. కానీ ఏ ఏడుపు ఎక్కడ ఏడవాలో, ఎవరిమీద ఏడవాలో తెలియకుండా పవన్ చేస్తున్న పోరాటం వృథా ప్రయాసే. తెలియక కాదు, కావాలని వైసీపీని టార్గెట్ చేసేందుకు పవన్ చేస్తున్న అదో రకం పోరాటం ఇది. కేంద్రానికి నొప్పి తగలకుండా వైసీపీని తప్పుబడుతూ పవన్ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.
గతంలో మౌనం.. ఇప్పుడు నోరు పారేసుకోవడం..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్షాన్ని ఏర్పాటుచేసి, ఢిల్లీకి తీసుకెళ్లాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు పవన్ కల్యాణ్. వాస్తవంగా మాట్లాడుకుంటే.. స్టీల్ ప్లాంట్ ఇష్యూ అనేది మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూగా దీన్ని చిత్రీకరిస్తున్నారు.
పోనీ కాసేపు అలానే అనుకుందాం. మరి ఏపీ రాజధాని సంగతేంటి? ప్రత్యేక హోదా సంగతేంటి? ప్రత్యేక ప్యాకేజీ సంగతేంటి? స్టీల్ ప్లాంట్ ఇష్యూ కంటే ఇవన్నీ పెద్ద అంశాలే. మరి ఈ అంశాలకు సంబంధించి గతంలో చంద్రబాబు అఖిలపక్షం పెట్టారా? ఆ విషయాన్ని అప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు లేవనెత్తలేదు.
ఏపీకి రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశంపై చంద్రబాబు పూర్తిగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. కమిటీ పేరు చెప్పి అమరావతిని రాజధానిగా ప్రకటించుకున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ఒక్కసారి కూడా అఖిల పక్షం ఏర్పాటుచేయలేదు.
హోదా వద్దని చెప్పి, ప్యాకేజీకి వెళ్లినప్పుడు కూడా అఖిలపక్షం పెట్టలేదు. ఆఖరి నిమిషంలో, ఎన్నికలకు ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం కోసం, తన రాజకీయ ప్రయోజనాల కోసం అఖిలపక్షం ఏర్పాటుచేశారు బాబు. దానికి వైసీపీ, జనసేన హాజరుకాలేదు. ఇంత చరిత్ర పెట్టుకొని, ఇప్పుడు పవన్ కల్యాణ్, అఖిలపక్షం మీటింగ్ డిమాండ్ చేస్తున్నారు.
ఇంతకీ అఖిలపక్షం పెడితే ఏం చేస్తారు?
బీజేపీకి వైసీపీ వ్యతిరేకం అని చాటిచెప్పడానికి ఈ అఖిలపక్షం. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటుచేసింది వైసీపీ కాబట్టి, ఆ పార్టీని బీజేపీ ముందు దోషిగా నిలబెట్టాలనేది వీళ్ల ఎత్తుగడ. పరోక్షంగా వైసీపీని బద్నామ్ చేసి, బీజేపీతో చేతులు కలపాలనేది బాబు కుతంత్రం. అందుకే అఖిలపక్షం అంటున్నారు.
సింగిల్ ఎమ్మెల్యే లేని నాకే మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారని చెప్పుకునే పవన్.. అదే నోటితో ఆయనతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేట్టు చేయొచ్చు కదా. కనీసం ప్రత్యేకే హోదాపై అయినా ప్రకటన చేయించొచ్చు కదా. ఆ రెండూ చేసి ఎన్నికలకు వెళ్తే జనం పవన్ ని నెత్తిన పెట్టుకుంటారని వేరే చెప్పక్కర్లేదు.
ఆ సత్తా లేదు కాబట్టే.. కేంద్రం తప్పులన్నిటికీ రాష్ట్రాన్ని టార్గెట్ చేసి పరోక్షంగా బీజేపీ దృష్టిలో మంచి అనిపించుకోవాలనుకుంటున్నారు పవన్. అలా అనిపించుకుంటేనే 2024 నాటికి పవన్ కి కాస్తో కూస్తో పలుకుబడి ఉంటుంది. జనక్షేత్రంలో గెలవలేకపోయినా.. బీజేపీ మనసు గెలవొచ్చనేది పవన్ ఆలోచన. అఖిలపక్షం అనే కాన్సెప్ట్ వెనక ఇంత రాజకీయం దాగుంది.