చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వైసీపీ పరిస్థితి తయారైంది. ప్రకాశం జిల్లాలో వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు భౌతిక దాడికి తెగబడడం, సంబంధిత వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైశ్యుల్లో వైసీపీపై వ్యతిరేకతకు ఈ ఘటన కారణమైంది. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చనిపోయినపుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూసేందుకు వెళ్లకపోవడం, ఆ తర్వాత సంస్మరణ సభకు కూడా సీఎం కాకుండా మంత్రులను పంపడంపై విమర్శలొచ్చాయి.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తుడిగా మెలిగిన రోశయ్య కుటుంబానికి తగిన రీతిలో జగన్ గౌరవం ఇవ్వలేదనే ఆక్రోశం వైశ్యుల్లో బలంగా ఉంది. మరోవైపు పుండుపై కారం చల్లిన చందంగా సుబ్బారావు గుప్తాపై సొంత పార్టీ కార్యకర్తలే దాడి చేయడం, దానికి నిరసనగా వైశ్యులు రోడ్డెక్కడం వైసీపీకి నష్టం కలిగించేవే. చివరికి ఈ వ్యవహారం పోలీసు కేసు వరకూ వెళ్లడం, అనంతరం మంత్రి బాలినేనిని బాధిత సుబ్బారావు కుటుంబ సభ్యులు కలవడం ఆసక్తి పరిణామంగా చెప్పొచ్చు.
ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌ల వ్యాఖ్యల వల్ల వైసీపీకి నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వీరు పార్టీకి కోవర్టులని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ముఖ్య నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సుబ్బారావు గుప్తాకు సొంత పార్టీ ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి బెదిరింపులు వెళ్లాయి.
ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన ఇంటిపై శనివారం రాత్రి కొందరు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా కనిపించకుండా ఎటో వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరులో ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను’ అంటూ సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది.
తనపై దాడి చేసిన వ్యక్తులపై గుప్తా ఫిర్యాదు చేశారు. అనంతరం సోమవారం రాత్రి కొంత మంది వైసీపీ నాయకులతో కలిసి సుబ్బారావు విజయవాడ వెళ్లారు. విజయవాడలో మంత్రి బాలినేనిని కుటుంబ సభ్యులతో సహా సుబ్బారావు గుప్తా కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. సుబ్బారావును మంత్రి ఓదార్చారు.
తానెప్పుడూ బాలినేని, వైసీపీ విధేయుడునేనని.. పార్టీకి నష్టం వాటిల్లే పరిణామాలపై మాత్రమే స్పందించానని సుబ్బారావు చెప్పారు. సుబ్బారావుపై దాడి చేయడం మంచిది కాదని మంత్రి అన్నారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, మంత్రి, గుప్తా, కుటుంబ సభ్యులు ఒకరికొకరు తినిపించుకోవడం విశేషం. ఇంతటితో సుబ్బారావు గొడవ ముగిసినట్టేనని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.