ఈమధ్య ఇదొక ట్రెండ్ అయిపోయింది. సినిమాపై నెగెటివ్ రివ్యూ రావడం ఆలస్యం, అంతా కలిసిపోతున్నారు. మూకుమ్మడిగా సమీక్షకుల్ని తిట్టిపోస్తున్నారు. ఇలా తిట్టి మరీ తమ సినిమాకు ప్రచారం తెచ్చుకోవడం కొత్త ఎత్తుగడగా మారిపోయింది. పుష్ప విషయంలో బన్నీ జనాలు ఇంతలా డైరక్ట్ అవ్వలేదు కానీ పరోక్షంగా తమ స్వకార్యం, స్వామికార్యం జరిపించేసుకుంటున్నారు.
పుష్ప సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఏకగ్రీవంగా అంతా బ్లాక్ బస్టర్ అంటారని మేకర్స్ భావిస్తే, సమీక్షకులు మాత్రం దీన్ని చీల్చిచెండాడారు. దీంతో వెంటనే 'కొంతమంది' రంగంలోకి దిగిపోయారు. వీళ్లలో కొందరు కలెక్షన్లపై దృష్టిసారిస్తే, మరికొందరు నెగెటివ్ రివ్యూల్ని మరిపించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా ఇప్పటికే నెగెటివ్ రివ్యూల్ని ఖండించింది యూనిట్. రివ్యూస్ ను పట్టించుకోకుండా సినిమా చూడాలని ప్రేక్షకుల్ని కోరుతోంది. అటు ఇండస్ట్రీలో కొంతమంది కూడా హీరోలు, టెక్నీషియన్స్ కూడా రివ్యూస్ తో సంబంధం లేకుండా పుష్ప చూడాలని పిలుపునిస్తున్నారు. ఇప్పుడీ పోకడను కొత్త ఎత్తుకు తీసుకెళ్లాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.
వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన ఈ దర్శకుడు.. పుష్ప సినిమాను మెచ్చుకుంటూ వరుసగా పోస్టులు పెట్టాడు. ఇందులో భాగంగా కేవలం ఫిలిం మేకర్స్ మాత్రమే పుష్ప సినిమాకు రేటింగ్ ఇవ్వాలంటూ నోట్ పెట్టాడు. పుష్ప సినిమాను ప్రతి ప్రేక్షకుడు చూడాలని, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు నిలబడి మరీ చప్పట్లు కొట్టాలని కోరుతున్న వంగ.. సినీచరిత్రలోనే బెస్ట్ పెర్ఫార్మెన్సుల్లో ఒకటిగా అల్లు అర్జున్ పోషించిన పుష్ప పాత్ర నిలిచిపోతుందని కితాబిచ్చాడు. ఈ సందర్భంగా సినిమాకు వందకు వంద మార్కులేశాడు.
పుష్ప సినిమా ప్రచారాన్ని ఇప్పట్లో ఆపేలా లేదు యూనిట్. రిలీజై 4 రోజులైనా ఇప్పటికీ ఈ సినిమా ప్రమోషన్ ను పీక్ స్టేజ్ లో చేస్తున్నారు. ఓవైపు నిర్మాతలు వరుస ప్రెస్ మీట్లు పెడుతుంటే, మరోవైపు హీరోహీరోయిన్, దర్శకుడు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రేపోమాపో ఈ సినిమాకు సంబంధించి భారీ విజయోత్సవ సభ కూడా ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందు ప్రచారం చేయడానికి పుష్ప యూనిట్ కు టైమ్ దొరకలేదు. దీంతో రిలీజ్ తర్వాత ఇలా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.