ఇంట్లో పెళ్లి జరగడం, పెళ్లికూతురు అత్తవారింట్లో అడుగుపెట్టడం.. ఇవన్నీ శుభకార్యాలు. ఎవ్వరూ ఇందులో మోసం అనే కోణాన్ని చూడరు, చూడలేరు. సరిగ్గా ఇక్కడే మోసానికి తెరదీసింది ఓ అమ్మాయి. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈమె, అత్తారింట్లో ఇలా అడుగుపెట్టి, అలా సర్వం దోచుకెళ్లింది. హైదరాబాద్ శివార్లలో జరిగింది ఈ ఘటన.
రంగారెడ్డి జిల్లా యాచారంకు చెందిన ఓ వ్యక్తి బాగా సెటిల్ అయ్యాడు. కానీ 40 ఏళ్లొచ్చినా ఇంకా పెళ్లికాలేదు. ఈ క్రమంలో ఓ పెళ్లిళ్ల పేరయ్య అతడికి పరిచయమయ్యాడు. లక్ష రూపాయలిస్తే మంచి అమ్మాయిని చూస్తానని మాటిచ్చాడు. లక్ష తీసుకొని చెప్పినట్టుగానే విజయవాడకు చెందిన ఓ అమ్మాయిని పరిచయం చేశాడు. అమ్మాయికి ఎవ్వరూ లేరని చెప్పాడు.
అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ విజయవాడలోనే ఓ లాడ్జిలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత యాదగిరిగుట్ట వెళ్లి పూజలు చేశారు. హైదరాబాద్ వచ్చి షాపింగ్ కూడా చేశారు. భర్తతో 3 తులాల బంగారు గొలుసు, 40వేల రూపాయల దుస్తులు కొనిపించుకుంది భార్య. షాపింగ్ చేసి రాత్రికి ఇంటికొచ్చారు.
ఇంటికొచ్చిన కొద్దిసేపటికే తలనొప్పిగా ఉంది టాబ్లెట్ తీసుకురమ్మని భర్తను కోరింది భార్య. అతడు బయటకెళ్లిన సమయం చూసి దుస్తులు, నగలు, మరో 2 లక్షల రూపాయల డబ్బుతో ఉడాయించింది. ఆమెతో పాటు వచ్చిన మరో యువతి, తననుతాను పెళ్లికూతురు చెల్లెలిగా పరిచయం చేసుకుంది. ఆమె బుక్ చేసిన క్యాబ్ లో ఇద్దరూ పరారయ్యారు. కారులోనే పెళ్లిదుస్తులు మార్చుకొని, ఎల్బీ నగర్ లో దిగి అట్నుంచి అటు విజయవాడ చెక్కేశారు.