కాంగ్రెస్ పార్టీది ఒక దారైతే, ఆ పార్టీ ముఖ్యనాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ చింతా మోహన్‌ది మరో దారి. రాజధాని విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నమైన అభిప్రాయాల్ని బలంగా వినిపిస్తుండడం విశేషం. ఏపీ రాజధానిగా తిరుపతి అన్ని రకాలుగా ఎంతో అనుకూలమైనదని స్పష్టం చేశారు.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ కొంత మంది ఇటీవల న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో తిరుపతికి పాదయాత్ర నిర్వహించడం, అనంతరం తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని సభా వేదికపై కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, మస్తాన్‌వల్లి బలంగా తమ పార్టీ వాయిస్ వినిపించిన సంగతి తెలిసిందే.
కానీ చింతా మోహన్ మాత్రం పార్టీ వైఖరిని పట్టించుకోకుండా, తిరుపతిని రాజధానిగా ప్రకటించాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలో రాజధానికి ప్రధానమంత్రి మోదీ వేసిన పునాది అనాదిగా మిగిలిందన్నారు. తిరుపతిని రాజధానిగా చేయాలని చింతా మోహన్ డిమాండ్ చేశారు. అమరావతి రైతులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందన్నారు.
రాజధానికి 1.5 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఏర్పేడు నుంచి రాపూరు వరకు అందుబాటులో ఉందని ఆయన చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటుచేస్తే 13 జిల్లాలకు అందుబాటులో ఉంటుందన్నారు. కండలేరు, సోమశిల జలాశయాలు ఉండటంతో పాటు, తిరుపతికి ఏడు జాతీయ రహదారుల కలయిక, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉందన్నారు. ఈ కారణాల రీత్యా తిరుపతిలో రాజధాని ఏర్పాటు చేయడం శ్రేయస్కరమని ఆయన వాదిస్తున్నారు.