2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి రానున్నారా? అంటే …ఔనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు భువనేశ్వరిని చంద్రబాబు ఒప్పించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నిజానికి భువనేశ్వరి రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కనబరచరు. సేవా, వ్యాపార కార్యకలాపాలపై మాత్రమే ఆమె దృష్టి కేంద్రీకరించారు. వాటిలో ఆమె విజయం సాధించిన మహిళగా గుర్తింపు పొందారు.
కానీ 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావుబతుకుల సమస్య. ఏ మాత్రం తేడా కొట్టినా…ఇక ఆ పార్టీ కనుమరుగు కావడమో లేక ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లిపోవడమే జరుగుతుందన్న భయాందోళన చంద్రబాబు కుటుంబంతో పాటు ఆయన అనుచరుల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల భువనేశ్వరిపై పాలక పక్షం దూషణకు దిగిందని స్వయంగా చంద్రబాబు ఏడ్వడం, అసెంబ్లీని బహిష్కరించడం, తన భార్యకు జరిగిన అవమానం రాష్ట్రంలోని ప్రతి మహిళకూ వర్తిస్తుందనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
మహిళాస్త్రాన్ని ప్రయోగించి, సెంటిమెంట్‌ను రగిల్చి రానున్న ఎన్నికల్లో వైసీపీని బద్నాం చేసేందుకు టీడీపీ వేస్తున్న వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా భువనేశ్వరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించారని సమాచారం. అయితే ఆమె రాక కేవలం రానున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారం వరకే పరిమితం చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.
వైఎస్ విజయమ్మను వైసీపీ ఏ విధంగా ఎన్నికల ప్రచారానికి తీసుకొస్తున్నదో, ఆ విధంగా భువనేశ్వరిని కూడా తిప్పాలని టీడీపీ ఆలోచన. తద్వారా వైసీపీని ఆత్మరక్షణలో పడేయొచ్చనేది చంద్రబాబు వ్యూహంగా చెబుతున్నారు. భువనేశ్వరికి జరిగిన అన్యాయాన్ని ఊరూరు వెళ్లి తాను వాపోవడం కంటే, ఆమెతోనే చెప్పిస్తే జనం నుంచి భారీ స్పందన వస్తుందనేది బాబు వ్యూహమని సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రకృతి వైపరీత్యాల కారణంగా చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో నష్టపోయిన వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీగా భువనేశ్వరి చేతుల మీదుగా ఆర్థిక సాయాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు రూపకల్పన చేసిన కార్యక్రమంగా ఆ పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ఏం చేసినా, ఎంతో ముందు చూపు ఉంటుందని టీడీపీ నాయకులు అంటున్నారు.
తిరుపతిలో భువనేశ్వరి పర్యటన, మీడియాతో ఆమె మాట్లాడుతూ రాజకీయ విమర్శలు… అన్నీ ఓ పథకం ప్రకారమే జరిగాయనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు లోకేశ్ ప్రచారానికి వెళితే నష్టమే తప్ప లాభం లేకపోవడం కూడా భువనేశ్వరిని రంగంలోకి దింపడానికి ప్రధాన కారణంగా టీడీపీ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో భువనేశ్వరి టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తారనే సమాచారం… ఆ పార్టీకి లాభమో, నష్టమో కాలమే తేల్చాల్సి వుంది.