మతంతో కాదు మదంతో కొట్టాడు

వాక్స్వాతంత్రం ఉందన్న దేశంలో నోరెత్తినవాడిని కొట్టడమంటే అది నిరంకుశమే. అధికారమదంతో విర్రవీగడమే. ఏం చేసినా చెల్లుతుందని కళ్లు బైర్లు కమ్మి ప్రవర్తించడమే. ఈ ప్రవర్తనగల మనుషులు ఏ ప్రభుత్వానికైనా ప్రమాదమే. అందులో ఏమీ అనుమానం…

వాక్స్వాతంత్రం ఉందన్న దేశంలో నోరెత్తినవాడిని కొట్టడమంటే అది నిరంకుశమే. అధికారమదంతో విర్రవీగడమే. ఏం చేసినా చెల్లుతుందని కళ్లు బైర్లు కమ్మి ప్రవర్తించడమే. ఈ ప్రవర్తనగల మనుషులు ఏ ప్రభుత్వానికైనా ప్రమాదమే. అందులో ఏమీ అనుమానం లేదు. 

ఒక పార్టీ కార్యకర్తో నాయకుడో సొంత పార్టీ నాయకుల్ని  విమర్శిస్తే నేరుగా అతని ఇంటికెళ్ళిపోయి కొట్టడం ఉన్మాదమైతే…దానిని వీడియో తీసి వీరత్వం చాటుకోవడం దిక్కుమాలిన పొగరుకి పరాకాష్ట. 

ఎవడిని సంతృప్తి పరుద్దామని ఆ వీడియో? 

“ఇదిగో అన్నా! మనోళ్లని తిట్టినోడ్ని చావగోట్టొచ్చాను” అని జబ్బ చరిచి తన నాయకుడు బాలినేని నుంచి మెప్పు పొందుదామనా? 

ఈ సుభానీలాంటి అనవసరపు ఆవేశపరులు ఉన్నంతకాలం పార్టీకే కాదు ప్రజాస్వామ్యస్ఫూర్తికే గొడ్డలిపెట్టు. 

ఈ వ్యక్తిని అరెస్టు చేయడం, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయస్థానానికి లాగడం, తీర్పుని బట్టి కటకటాలు చూపించడం తప్పనిసరి. 

అంతలా కొడుతూ “చంపేస్తా” అని బెదిరించడం అంటే ఐపీసీ 302 కింద హత్యాప్రయత్నం కేసు కూడా పెట్టే అవకాశం లేకపోలేదు. 

ఈ ప్రమాదమంతా ఒకెత్తైతే ఒక వర్గం మీడియా చేస్తున్న పని అంతకన్నా ఘోరం. అది ప్రమాదం కంటే పెద్దది.  

ఆయన పేరు చంద్రశేఖర్. కానీ ఒక వర్గం మీడియా ఈ రోజు ఆయన్ని చంద్రశేఖర్ గుప్తా ని చేసింది. ఎందుకు? తన కులమేంటో ఆ కులసంఘాలకి తెలియాలి, అవి రెచ్చిపోవాలి..అలా కుల, మత పరమైన గొడవలు సృష్టించి ఆ వార్తలతో చలికాచుకోవాలి. ఇదొక పైశాచిక ఉన్మాదం. 

కొట్టినవాడు ముస్లిం కావొచ్చు. కొట్టబడిన వ్యక్తి వైశ్యుడు కావొచ్చు. కానీ అక్కడ అతను కుల,మత ప్రాతిపదిక మీద కొట్టలేదు. అధికారమదంతో కొట్టాడు. అతను ఎవడి అనుచరుడో అతని మెప్పుకోసం కొట్టాడు. రౌడీ బుద్ధితో కొట్టాడు. ఆ వైశ్యుడి స్థానంలో ఉన్నది ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా అలాగే ప్రవర్తించేవాడు. కొట్టినవాడు ముస్లిం కాకపోయినా సీన్ ఇలాగే ఉండేది. ఎందుకంటే కారణం కులమో మతమో కాదు..మదం.  

ఈ కులం రంగు వార్తలు టీవీలో చూసి హైదరాబాదులో ఒక వైశ్య సంఘం ప్రముఖుడు నిప్పులు చెరిగాడు. “మా వైశ్యుల పవరేంటో రేపు చూపిస్తాం” అంటూ అందరు వైశ్యులకి యుద్ధానికి రమ్మని పిలుపునిచ్చాడు. 

ఢిల్లీలో కూర్చున్న ఒక తెలుగు బ్రాహ్మణ న్యాయవాది “ఇది హిందూమతంపై దాడి. మోదీకి, అమిత్ షా కి తెలుస్తోందా?” అంటూ గర్జించాడు. 

ఇలా వైశ్యకులసంఘాలు, హిందూమత సంఘాలు దీనిని ఒక ముస్లిం వ్యక్తి వైశ్యుడు మీద జరుపుతున్న దాడిగా చూసేలా రెచ్చగొట్టాయి మీడియాలు. 

అసలు ఏ అధికారమదంతో కొట్టాడు అనేది పక్కకు పోయి కులమతాల రంగు పులిమిన ఘనత మాత్రం ఆ వర్గం మీడియాదే. 

“పవర్ కరప్ట్స్. ఆబ్సొల్యూట్ పవర్ కరప్ట్స్ ఆబ్సొల్యూట్లీ” అంటారు. ఇప్పుడు ఆంధ్రలో వైసీపీ సర్కారుకి ఆబ్సొల్యూట్ పవర్ ఉందన్న మాట వాస్తవం. కానీ ఆ పవరుతో చేసే మాటల యుద్ధం వరకు ప్రజలు సహిస్తారు. కానీ చేతల్లోకి వెళ్లి ఇలాంటి సంఘటనలు బయటపడినప్పుడు పార్టీకి తీవ్రసమస్యలు తప్పవు. 

ఇప్పుడు పార్టీ అధిష్టానం చేయాల్సిన పని ఒకటుంది. కొట్టింది, కొట్టించుకున్నది తమ పార్టీకి చెందిన వారే. 

ఎటువంటి రాగద్వేషాలూ లేకుండా కొట్టినవాడిని అరెస్టు చేయించాలి. 

అతని నాయకుడైన బాలినేని శ్రీనివాస రెడ్డి ని కూడా ఏ బంధుప్రీతి చూపకుండా వెంటనే మంత్రి పదవి నుంచి తప్పిస్తే పార్టీకి గౌరవం దక్కుతుంది. మిగిలిన నాయకులకి, వాళ్ల అనుచరులకి ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరికగా కూడా ఉంటుంది. 

దెబ్బలు తిన్న వ్యక్తితో అనునయంగా మాట్లాడాలి. ఈ రెండూ ప్రజలు చూసేలా వీడియోలుండాలి. 

అప్పుడే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న దుర్మార్గపు వీడియో గుర్తులు ప్రజల స్మృతుల్లోంచి చెరిగిపోతాయి. 

దీనిని కులమాతల యాంగిల్లో చూసే కుత్సితమైన బుద్ధి కూడా నియంత్రించబడుతుంది. 

ప్రభుత్వం రేపటికల్లా ఆ పని చేస్తుందో లేదో చూడాలి. “శిష్ట రక్షణ- దుష్ట శిక్షణ” ప్రభుత్వానికి తప్పదు. 

శ్రీనివాసమూర్తి