పివి రమేష్.. ఈ ప్రశ్నకు బదులేది?

ప్రభుత్వ డే టు డే నిర్ణయాలకు ఎక్కువగా అధికారులే బాధ్యులు. ముఖ్యమంత్రి ప్రతి అక్కౌంట్ లావాదేవీలు చూస్తూ కూర్చోరు కదా. అందువల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అధికారులను బాధ్యులను చేయాలి తప్ప, ముఖ్యమంత్రిని కాదు…

ప్రభుత్వ డే టు డే నిర్ణయాలకు ఎక్కువగా అధికారులే బాధ్యులు. ముఖ్యమంత్రి ప్రతి అక్కౌంట్ లావాదేవీలు చూస్తూ కూర్చోరు కదా. అందువల్ల స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అధికారులను బాధ్యులను చేయాలి తప్ప, ముఖ్యమంత్రిని కాదు అంటున్నారు మాజీ ఐఎఎస్ రమేష్. 

బాగానే వుంది. మరి వైఎస్ హయాంలో వ్యవహారాల మీద మరి జగన్ ను ఎందుకు అరెస్ట్ చేసినట్లు? అరెస్ట్ చేస్తే అప్పటి అధికారులను చేయాలి. ఎలాగూ చేసారు. జగన్ అప్పటి ప్రభుత్వంలో లేరు. వున్నా కూడా రమేష్ వాదన ప్రకారం అరెస్ట్ చేయకూడదు. మరెందుకు ప్రాధమిక సాక్ష్యం వుందని అరెస్ట్ చేసినట్లు?

అంటే జగన్ అయితే ఒక రూలు.. వేరే వాళ్లయితే మరో రూలా?

అసలు చంద్రబాబు అరెస్ట్‌ను ఎందుకు అంత దారుణంగా చూస్తున్నారు? చాలా వరకు కోర్టు తీర్పులు బాబుకు అనుకూలంగా, జగన్ కు వ్యతిరేకంగా వచ్చినవే కదా. రిమాండ్ అన్న పాయింట్ ను పక్కన పెడితే ఈ కేసు నుంచి చంద్రబాబు బయటపడడం పెద్ద కష్టం కాదని ఆయనకు తెలిసే వుండాలి. ఎందుకంటే తనే అవినీతి చేయలేదని పదేే పదే చెబుతున్నారు కదా. సాక్ష్యాలు కూడా లేవంటున్నారు. మరి అలాంటపుడు భయమెందుకు. మహా అయితే ఒకటి రెండు రోజుల్లో బెయిల్ మీద వచ్చేస్తారు.

ఇక ఇంత గొడవ ఎందుకు? పైగా ఈ కేసు వల్ల తెలుగుదేశానికి లాభం అని, సింపతీ ఫ్యాక్టర్ వర్కవుట్ అవుతుందని వారే అంటున్నారు కదా. మరి ఇంకెందుకు గోల పెట్టడం, బంద్ చేయడం, హడావుడి. అసలు మరి కోన్నాళ్లు రిమాండ్ లో వుంటే మరింత సింపతీ పెంచే వార్తలు వండి వార్చుకునే అవకాశం వుంటుంది కదా?

తెలుగుదేశం అనుకూల పత్రికల్లో జగన్ మీద తిట్టిపోస్తూ వార్తలు పుంఖానుపుంఖాలుగా వండి వారుస్తున్నారు. బాగానే వుంది. వాటికి బదులు, అసలు ఏమిటీ స్కిల్ స్కామ్. ఎబిసిడి దగ్గర నుంచి కోట్లు విడుదలయ్యే వరకు ఏం జరిగింది. ఏ ఫైల్ మీద ఎవరు సంతకం పెట్టారు. తేదీల వారీ గా వివరంగా ఇస్తే జనానికి నిజానిజాలు అర్థం అవుతాయి కదా.

అవన్నీ వదిలేసి అసలు చంద్రబాబును అరెస్ట్ చేయడమే దారుణాతి దారుణం అంటూ గగ్గోలు పెట్టడం వల్ల సింపతీ వస్తుందా? అనుమానమే.