భార్య, భర్త, ప్రియుడు.. మధ్యలో ఓ గుండు

ఇదో విచిత్రమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో క్రైమ్ కూడా ఉంది. కానీ అది మనం ఊహించినంత పెద్దది కాదు, అలాగని మరీ చిన్నదీ కాదు. జస్ట్ రివేంజ్ తీర్చుకునే టైపు. తన భార్యతో…

ఇదో విచిత్రమైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో క్రైమ్ కూడా ఉంది. కానీ అది మనం ఊహించినంత పెద్దది కాదు, అలాగని మరీ చిన్నదీ కాదు. జస్ట్ రివేంజ్ తీర్చుకునే టైపు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన వ్యక్తితో నేరుగా గొడవపడే ధైర్యం లేక, సోషల్ మీడియా సహాయంతో రివేంజ్ తీర్చుకోవాలనుకున్నాడు ఓ భర్త. అయితే ఆ భర్తకు జీవితాంతం గుర్తుపెట్టుకునే విధంగా జవాబిచ్చాడు ప్రియుడు. అతడికి గుండు కొట్టించి, బలవంతంగా ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేయించి సోషల్ మీడియాలో పెట్టించాడు. ఈ రివేంజ్ డ్రామా ఇప్పుడు వైరల్ గా మారింది.

తిరుపతిలోని చంద్రగిరిలో భార్య, భర్త నివాసం ఉండేవారు. ఇటీవల భర్తకు బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. అతను భార్యను చంద్రగిరిలోనే వదిలిపెట్టి బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. వారానికోసారి ఇంటికొచ్చేవాడు. అయితే ఈలోగా చంద్రగిరిలో ఉన్న భార్య, అన్వర్ అనే వ్యక్తికి దగ్గరైంది.

గుట్టుచప్పుడుగా సాగుతున్న ఈ వ్యవహారం అందరికీ తెలుసింది. చివరకు భర్త కూడా ఓసారి రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకుని మందలించాడు. కానీ వారిద్దరూ మునుపటి కన్నా జోరుపెంచారు. దీంతో భర్తకు ఏం చేయాలో పాలుపోలేదు. సోషల్ మీడియాలో అన్వర్ పరువు తీద్దామనే ఉద్దేశంతో అతడి ఫొటో పోస్ట్ చేసి కింద RIP అంటూ మెసేజ్ పెట్టాడు. దీంతో అన్వర్ కి కోపమొచ్చింది. సోషల్ మీడియాలో తాను చనిపోయినట్టు పోస్టింగ్ పెట్టాడనే కోపంతో అతడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. కిడ్నాప్ చేసి ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు.

ప్రియురాలి భర్తపై దాడి చేశాడు అన్వర్. అతడి తలపై మూత్రం పోసి శాడిజం చూపించాడు. అంతే కాదు, అతడికి గుండు కూడా కొట్టించాడు. అక్కడితో ఆగలేదు. తానే గుండు గీయించుకున్నానని, తనకు ఏం జరిగినా దానికి తానే బాధ్యుడినంటూ ఓ వీడియో కూడా తీయించాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టాడు అన్వర్.

రివేంజ్ తీర్చుకున్నాను అనుకున్నాడే కానీ, పోలీసులకు దొరికిపోతానని అనుకోలేదు. ఈ వీడియోలు వైరల్ కావడంతో స్థానిక పోలీసులు ఆరా తీశారు. భర్త ఫిర్యాదుతో ప్రియుడు అన్వర్ పై కేసు పెట్టారు. అన్వర్ తోపాటు, అతడికి సహకరించిన వంశీ చౌదరి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధాల నేపథ్యంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు.. చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ భర్త, ప్రియుడు.. ఇద్దరూ ఆ స్థాయిలో ధైర్యం చేయలేదు. సోషల్ మీడియా వార్ తో ఇలా పరువు బజారుకీడ్చుకున్నారు.