ఆ రాత్రి క‌రెంట్ తీసేసి…క్రూరంగా కొట్టారు!

గ‌న్న‌వ‌రం ఎపిసోడ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి ఎట్ట‌కేల‌కు ఇవాళ బెయిల్‌పై బ‌య‌టికొచ్చారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలు నుంచి విడుద‌లైన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీ స‌ర్కార్ ఎన్ని ర‌కాలుగా త‌న‌ను…

గ‌న్న‌వ‌రం ఎపిసోడ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి ఎట్ట‌కేల‌కు ఇవాళ బెయిల్‌పై బ‌య‌టికొచ్చారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలు నుంచి విడుద‌లైన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏపీ స‌ర్కార్ ఎన్ని ర‌కాలుగా త‌న‌ను హింసించినా త‌గ్గేదే లేద‌న్నారు. త‌ప్పుడు కేసుల‌తో హింసకు గురి చేసినా బెద‌ర‌బోమ‌ని, అలాగే లొంగిపోయేది లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

చంద్ర‌బాబు నేతృత్వంలో ప్ర‌జ‌ల ప‌క్షాన మాట్లాడుతున్న ఈ గొంతుక ఆగేది లేద‌న్నారు. టీడీపీ బ‌ల‌హీన‌వ‌ర్గాల పార్టీ అన్నారు. బ‌ల‌హీన వ‌ర్గాలు వెన్నెముక‌గా నిలిచిన పార్టీగా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఫిర్యాదు చేసేందుకు వెళితే అక్రమంగా కేసుల్లో ఇరికించారని పట్టాభి వాపోయారు. సాధార‌ణంగా ర‌క్ష‌ణ కోసం ప్ర‌జ‌లు పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్తార‌న్నారు. కానీ తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి తనను తీవ్రంగా కొట్టారని చెప్పారు.

ముగ్గురు దుండ‌గుల‌ను పంపించి అర్ధ‌రాత్రి రెండు నుంచి ఐదు గంట‌ల వ‌ర‌కు అతి క్రూరంగా కొట్టించి, హింసించార‌న్నారు. త‌న‌పై జ‌రిగిన హింస‌ను ప్ర‌జ‌లంతా చూస్తున్నార‌న్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్ర‌భుత్వానికి బుద్ధి చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ఇప్పటికే నాలుగు సార్లు తనపై దాడి జరిగిందని.. అయినా కూడా వెన‌క‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌ని ప‌ట్టాభి తేల్చి చెప్పారు.

చంద్ర‌బాబు, లోకేశ్ సార‌థ్యంలో రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడేందుకు అడుగు ముందుకేస్తామ‌న్నారు. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని ఆయన అన్నారు. అయితే ఇవాళ మాత్రం ఆయ‌న ప్ర‌త్యేకంగా అధికార ప‌క్షం నేత‌ల పేర్లు ప్ర‌స్తావించ‌కుండా మాట్లాడారు. అరేయ్ వంశీ, ఒరేయ్ నాని, తాడేప‌ల్లి పిల్లి, సైకో లాంటి దూష‌ణ‌లు లేకుండా ఆయ‌న మీడియాతో మాట్లాడ్డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. 

త‌న స‌హ‌జ స్వ‌భావానికి విరుద్ధంగా ఆయ‌న మీడియాతో చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడిన‌ట్టు ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు. పోలీస్‌స్టేష‌న్‌లో దెబ్బ‌లు క‌నీసం ఒక నెలైనా ప‌ట్టాభి నోటిని కంట్రోల్‌లో పెట్టే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. నోరు జారితే చిత‌క్కొడ్తార‌నే భ‌యం ఉన్నంత వర‌కూ ఆయ‌న ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకునే మాట్లాడ్తారు. లేదంటే నోటికి హ‌ద్దు, అదుపూ వుండ‌దు.