రెండో రోజూ అదే ఊపు…శభాష్ ఏపీ

ఏపీకి దశ తిరుగుతోంది. మంచి రోజులు వస్తున్నాయి. విభజన తరువాత గడచిన తొమ్మిదేళ్ళుగా ఏపీ అష్ట కష్టాలు పడుతోంది. అలాంటి ఏపీకి పాత జాతకం మారింది. అన్నీ మంచి శకునములే అన్నట్లుగా విశాఖలో సాగుతున్న…

ఏపీకి దశ తిరుగుతోంది. మంచి రోజులు వస్తున్నాయి. విభజన తరువాత గడచిన తొమ్మిదేళ్ళుగా ఏపీ అష్ట కష్టాలు పడుతోంది. అలాంటి ఏపీకి పాత జాతకం మారింది. అన్నీ మంచి శకునములే అన్నట్లుగా విశాఖలో సాగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి పెట్టుబడుల వరద పారుతోంది. తొలి రోజు పదకొండు లక్షల కోట్ల దాకా ఒప్పందాలు జరిగితే రెండవ రోజు కూడా అదే ఊపు కనిపిస్తోంది.

రెండవ రోజు రిలయన్స్ తో యాభై వేల కోట్ల ప్రాజెక్ట్ కి ఒప్పందం కుదిరింది. అలాగే హెచ్ పీ సీ ఎల్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఒప్పందం 14 వేల 320 కోట్లు, ఎకో స్టీల్ ప్రాజెక్ట్ ఒప్పందం 894 కోట్లు, బ్లూ స్టార్ ఎంఓయూ 890 కోట్లుగా ఉంది. ఇలా పెద్ద సంఖ్యలోనే ఒప్పందాలు కుదరడం పట్ల ప్రభుత్వ వర్గాలు హ్యాపీగా ఉన్నాయి.

తొలి రోజుల 92 ప్రాజెక్టులకు సంబంధించి ఒప్పందాలు కుదరగా, రెండవ రోజు కూడా అరవైకి పైగా సంస్థలు తమ కొత్త  ప్రాజెక్టులు ఏపీలో పెట్టేందుకు వీలుగా ఒప్పందాలు జరిగాయి. టోటల్ గా ఏపీకి పదమూడు లక్షలకు పైగా విలువ చేసే పరిశ్రమలు తరలి రానున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తున్నాయి. దీని వల్ల ఏపీలో ఆరు లక్షల మంది దాకా యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.

దీనిని బట్టి చూస్తే ఏపీలో గత కాలం చేదు అంతా పోయిందని, కొత్త ఉషస్సులతో ఏపీ ఇక మీదట బంగారు భవిష్యత్తు వైపుగా అడుగులు వేస్తోందని అంటున్నారు. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావడం అంటే అది జగన్ బ్రాండ్ ఇమేజ్ మాత్రమే అని మంత్రి గుడివాడ అమరనాధ్ అంటున్నారు.

ఉత్తరాంధ్రా సహా ఏపీకి మహర్దశ పట్టిందని అందుకు పెట్టుబడుల పండుగ నిదర్శనం అని మరో మంత్రి సీదరి అప్పలరాజు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సానుకూల పరిణామాలు చూస్తూంటే శభాష్ ఏపీ నీదే రేపటి రోజు అని అంతా అంటున్న మాట.