గ్రాడ్యుయేట్స్‌, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలిచేదెవ‌రు?

ఈ నెల 13న జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా అంద‌రి దృష్టి గ్రాడ్యుయేట్స్, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానాల‌పై ఉంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ పూర్థి స్థాయి మెజార్టీ వుండ‌డంతో ఆ పార్టీ విజ‌యావ‌కాశాల‌పై…

ఈ నెల 13న జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా అంద‌రి దృష్టి గ్రాడ్యుయేట్స్, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ స్థానాల‌పై ఉంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ పూర్థి స్థాయి మెజార్టీ వుండ‌డంతో ఆ పార్టీ విజ‌యావ‌కాశాల‌పై ఎవ‌రికీ అనుమానం లేదు. కానీ మూడు గ్రాడ్యుయేట్లు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజ‌క‌వ‌ర్గాల ఫ‌లితాల‌పై ఉత్కంఠ నెల‌కుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. నిరుద్యోగుల్లో కూడా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత వుందంటున్నారు.

ఈ ఫ‌లితాలు రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లపై ప్ర‌భావం చూప‌నుండ‌డంతో ఉపాధ్యాయులు, నిరుద్యోగుల వైఖ‌రి ఎలా వుందో తెలుసుకోవాల‌నే ఆసక్తి అన్ని రాజ‌కీయ ప‌క్షాల్లోనూ వుంది. తూర్పు రాయ‌ల‌సీమ (ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు); పశ్చిమ రాయలసీమ (క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలు); శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ ప‌ట్ట‌భ‌ద్రులు, అలాగే తూర్పు, ప‌శ్చిమ రాయ‌ల‌సీమ ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల‌కు  ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

మూడు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాల్లో దాదాపు 9 ల‌క్ష‌ల మంది, అలాగే  రెండు ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 43 వేల మంది ఓట‌ర్లున్నారు. తూర్పు , ప‌శ్చిమ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌కు వైసీపీ, టీడీపీ అభ్య‌ర్థుల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున వెన్న‌పూస ర‌వి, టీడీపీ నుంచి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి బ‌రిలో ఉన్నారు. అలాగే తూర్పు రాయ‌ల‌సీమ‌లో గ్రాడ్యుయేట్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ , టీడీపీల నుంచి శ్యాంప్ర‌సాద్‌రెడ్డి, శ్రీ‌కాంత్ పోటీ చేస్తున్నారు. తూర్పు, ప‌శ్చిమ ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ తర‌పున  ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, ఎంవీ రామ‌చంద్రారెడ్డి, పీడీఎఫ్ అభ్య‌ర్థులుగా పి.బాబురెడ్డి, క‌త్తి న‌ర‌సింహారెడ్డిల‌తో పాటు ఒంటేరు శ్రీ‌నివాసుల‌రెడ్డి, జీవీ నారాయ‌ణ‌రెడ్డి త‌దిత‌రులు బ‌రిలో నిలిచారు.

ప్ర‌స్తుతం ఆ రెండు చోట్ల పీడీఎఫ్ అభ్య‌ర్థి క‌త్తి న‌ర‌సింహారెడ్డి, అలాగే ప్ర‌స్తుతం ఆ సంఘానికి మ‌ద్ద‌తు ఇస్తున్న విఠ‌పు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా కొన‌సాగుతున్నారు. తాజాగా విఠ‌పు బాలసుబ్ర‌హ్మ‌ణ్యం బ‌రిలో లేరు. తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి బాబురెడ్డి  పోటీ చేస్తున్నారు. వివిధ‌ కార‌ణాల రీత్యా పీడీఎఫ్ అభ్య‌ర్థుల‌పై సొంత వాళ్ల‌లోనే తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ద్ద‌తు నామ‌మాత్ర‌మే. అందుకే ఆ పార్టీ మ‌ద్ద‌తుదారుల‌ను మిగిలిన అభ్య‌ర్థులు క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి కూడా తీసుకోలేదు.

ఒంటేరు శ్రీ‌నివాసుల‌రెడ్డి గ‌త రెండు ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌నే సానుభూతి ఉన్న‌ప్ప‌టికీ, చెప్పుకోత‌గ్గ స్థాయిలో బ‌ల‌ప‌డ‌లేదు. ఏ అంచ‌నా లేకుండా బ‌రిలో నిలిచిన ప్ర‌ధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు జీవీ నారాయ‌ణ‌రెడ్డి క్ర‌మంగా పుంజుకున్నార‌నే వార్త‌లొస్తున్నాయి. అయితే ఆయ‌న బ‌లం అధికార పార్టీ ఆర్థిక‌, అంగ‌బలాల‌ను అధిగ‌మించే స్థాయిలో ఉందా? అనేది ప్ర‌శ్న. ఎందుకంటే వామ‌ప‌క్ష పార్టీలు అంతోఇంతో బ‌లంగా ఉన్న‌ది ఉపాధ్యాయ‌, విద్యార్థి సంఘాల్లోనే. టీచ‌ర్స్‌, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు వామ‌ప‌క్షాలతో పాటు మిగిలిన ప్ర‌తిప‌క్షాలు గగ్గోలు పెడుతున్నాయి.

పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చార‌ని, క‌నీస అర్హ‌త లేని వారిని కూడా గ్రాడ్యుయేట్స్‌, టీచ‌ర్స్  ఎన్నిక‌ల్లో ఓట్లు వేసేలా చేసుకున్నార‌ని ఎన్నిక‌ల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేయ‌డం తెలిసిందే. కొంత వ‌ర‌కూ అరిక‌ట్ట‌గ‌లిగారు. ఈ ఎన్నిక‌ల‌ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని, ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప్ర‌జాప్ర‌తినిధుల‌కు గ‌ట్టి ఆదేశాలు జారీ చేశారు. దీంతో గ్రాడ్యుయేట్స్‌, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ మాత్రం తేడా వ‌చ్చినా, త‌మ టికెట్‌పై ప్ర‌భావం చూపుతుంద‌నే భ‌యంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు య‌థేచ్ఛ‌గా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు న్నాయి.

తాము చేర్చిన ఓట్ల‌ను ప‌క్కాగా వేసుకుంటే చాలు, సునాయాసంగా గెల‌వొచ్చ‌నే లెక్క‌ల్లో వైసీపీ నేత‌లున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ వైసీపీ లెక్క‌లేవీ త‌ప్ప‌లేదు. ఆ ధీమానే గ్రాడ్యుయేట్స్‌, టీచ‌ర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో గెలుపు అవ‌కాశాల‌పై క‌నిపిస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ద్వారా ఉపాధ్యాయులు, నిరుద్యోగుల్లో త‌మ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త లేద‌ని చాటి చెప్పేందుకు వైసీపీ ఏం చేయ‌డానికైనా సిద్ధంగా వుంది. ప్ర‌జాస్వామ్యం ఖూనీ, ప‌రిహాసం లాంటి మాట‌ల‌న్నీ గెల‌వ‌లేనోళ్లు, నిస్స‌హాయులు చేసే ఆక్రంద‌న త‌ప్ప‌, మ‌న వ్య‌వ‌స్థ‌లో అంత‌కు మించి మాట్లాడ్డానికి ఏమీ ఉండ‌దు. ఎందుకంటే ప్ర‌జాస్వామ్య స్ఫూర్తి  ప‌త‌నం మొద‌లై చాలా ఏళ్లైంది.