
ప్రత్యక్ష రాజకీయాల్లోకి భూమా మౌనిక, మంచు మనోజ్ ఎంటర్ అవుతారా? అంటే ...ఔననే సమాధానం వస్తోంది. వీళ్లిద్దరూ శుక్రవారం రాత్రి ఏడడుగులు నడిచి కొత్త జీవితాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం మౌనిక స్వగృహంలో ఆమె అక్క, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రిసెప్షన్ ఇవ్వనున్నారు. అక్కచెల్లెళ్ల మధ్య ఆస్తి గొడవలున్నాయి. అయితే మౌనిక వివాహం నేపథ్యంలో గొడవలను పక్కన పెట్టి కుటుంబ సభ్యులంతా ఐక్యంగా ఉండడం ప్రశంసనీయం.
ఇదిలా వుండగా మౌనికకు రాజకీయాల్లో రాణించాలనే ఆకాంక్ష బలంగా వుంది. గతంలో తన తల్లిదండ్రుల కోసం ఆమె ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో ప్రచారం చేసేవారు. అలాగే నంద్యాల ఉప ఎన్నికలో తన సోదరి అఖిలప్రియ, తమ్ముడు జగత్‌విఖ్యాత్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు చానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. మౌనిక చక్కగా మాట్లాడ్తారనే పేరు తెచ్చుకున్నారు.
రాజకీయాలపై ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ సమస్యలతో ఆమె అటు వైపు దృష్టి సారించలేదు. అయితే టాలీవుడ్‌లో మంచు మోహన్‌బాబుకు ఉన్న పేరు ప్రతిష్టల గురించి అందరికీ తెలిసినవే. ఆ ఇంటి కోడలిగా మౌనికకు ఇప్పుడు అదనపు బలం వచ్చింది. రానున్న రోజుల్లో భర్త మంచు మనోజ్‌తో కలిసి ఆమె నంద్యాల జిల్లాలో సరికొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
అయితే ఆళ్లగడ్డా? లేక నంద్యాల? అనేది ఆమె ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిసింది. మొదట ఆస్తుల పంపకాలు, ఆ తర్వాత ఏ పార్టీ, ఏ నియోజకవర్గం నుంచి రాజకీయాన్ని మొదలెట్టాలో నిర్ణయించుకుంటారని తెలిసింది. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌తో పోల్చుకుంటే, మంచు మనోజ్ బలమైన కుటుంబ, రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తి. దీంతో తమ రాజకీయ ప్రస్థానానికి మార్గం సుగుమం అవుతుందని ఆ కొత్త జంట యోచిస్తున్నట్టు తెలిసింది.
రాజకీయాల్లో యువతకు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మంచు కుటుంబానికి ఇటు వైఎస్ జగన్, అటు చంద్రబాబు కుటుంబాలతో సన్నిహిత సంబంధాలున్నాయి. మరి ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.