ఓహో…ఏపీకి పెట్టుబ‌డుల వెల్లువ‌కు కార‌ణం ఇదా?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు పరిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై దృష్టి సారించారు. విశాఖ‌లో రెండో రోజు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌-2023 కొన‌సాగుతోంది. మొద‌టి రోజు సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో రూ.11.88 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎట్ట‌కేల‌కు పరిశ్ర‌మ‌ల స్థాప‌న‌పై దృష్టి సారించారు. విశాఖ‌లో రెండో రోజు గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌-2023 కొన‌సాగుతోంది. మొద‌టి రోజు సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో రూ.11.88 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు 92 ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే రెండో రోజు మ‌రో రూ.1.15 ల‌క్ష‌ల కోట్లు పెట్టుబ‌డుల‌కు ఒప్పందాలు కుదుర్చుకోనున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఈ ప‌రిణామాలు రాజ‌కీయంగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఏ మాత్రం జీర్ణించుకోలేక‌పోతోంది. ఇక చంద్ర‌బాబుకు ప‌ర‌మ భ‌క్తుడైన జ‌ర్న‌లిస్ట్ &మీడియాధిప‌తికి చెందిన చాన‌ల్‌, ప‌త్రిక క‌డుపు మంట మాట‌ల్లో చెప్ప‌లేని విధంగా వుంది. నిన్న‌టి వ‌ర‌కూ ఏపీకి పారిశ్రామిక‌వేత్త‌లు రావ‌డానికి భ‌య‌ప‌డుతున్నార‌ని, ఆ రాష్ట్ర ప‌రిస్థితుల‌పై ఐపీఎస్‌, ఐఏఎస్ అధికారుల‌ను జాతీయ స్థాయిలో ఆరా తీస్తున్నార‌ని ఇదే ప‌త్రిక రాసింది. ఇవాళేమో పెట్ట‌బ‌డుల‌న్నీ క‌ట్టుక‌థ‌ల‌ని త‌న మార్క్ రాత‌లు రాసుకొచ్చింది. గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో క‌డుపు నిండా తిండి కూడా పెట్ట‌లేద‌ని రాయ‌డం ద్వారా త‌మ క‌డుపు మంట‌ను స‌ద‌రు మీడియా సంస్థ బ‌య‌ట పెట్టుకుంది.

ఇంకా న‌యం, తిండి కోసం ముఖేష్ అంబానీ, అదానీ కొట్టుకున్నార‌ని రాయ‌లేదంటూ సెటైర్స్ పేలుతున్నాయి. ఇదే సంద‌ర్భం లో టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా ఓవ‌రాక్ష‌న్‌పై సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో నెటిజ‌న్లు ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. విశాఖ‌లో గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ విజ‌య‌వంతం కావ‌డం, ల‌క్ష‌లాది కోట్లు పెట్టుబ‌డులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్త‌లు ఆస‌క్తి చూప‌డానికి ప్ర‌ధాన కార‌ణం అంటూ వ్యంగ్య పోస్టులు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి.

ఏపీ సీఎం చంద్ర‌బాబు అని చెబితే విశాఖ స‌మ్మిట్‌కు వ‌చ్చామ‌ని, తీరా ఇక్క‌డ జ‌గ‌న్ ప్ర‌త్య‌క్షం కావ‌డంపై పారిశ్రామిక‌వేత్త‌లు ఆరా తీశారంటూ నెటిజ‌న్లు వెట‌క‌రిస్తూ పోస్టులు పెడుతున్నారు. బాబు సీఎం అని చెప్పి, త‌మ‌ను మోసగించార‌ని మ‌రికొంద‌రు పారిశ్రామిక వేత్త‌లు ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్‌లో ఆందోళ‌న‌కు దిగినట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం అంటూ రాయ‌క‌పోయారా? అని ప‌చ్చ మీడియాను నెటిజ‌న్లు చెడుగుడు ఆడుకుంటున్నారు.