సుజనా చౌదరి అక్రమాల గురించి విచారణ జరిపించాలని కోరుతూ ఇప్పటికే రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి అక్కడ నుంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించిన చర్యలను తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్రపతి ఆఫీస్ నుంచి ఆయా శాఖలకు లేఖలు వెళ్లాయి.
ఆ సంగతలా ఉంటే.. సుజనా చౌదరి పై విజయసాయిరెడ్డి మరో ఆసక్తిదాయకమైన ట్వీట్ చేశారు. సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ అధిష్టానం గ్రహించిందని అంటున్నారు సాయిరెడ్డి. అందుకు సంబంధించిన ట్వీట్ ఇలా ఉంది.
'' సుజనా చౌదరి చంద్రబాబు కోవర్ట్ అని బీజేపీ వాళ్లకు ముందే తెలుసు. ఆయనతో పాటు మరో ముగ్గుర్ని చంద్రబాబు నాయుడే పంపించాడనీ వాళ్లకు అర్థమైంది. ఢిల్లీలో ఎవరెవరిని కలుస్తాడు, ఎవరిని కాపాడటం కోసం పనిచేస్తున్నాడనేది త్వరలోనే బయట పడుతుంది. వ్యవస్థలను మ్యానేజ్ చేయడం ఎల్లవేళలా సాధ్యం కాదు. '' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
ఎన్నికలు అయిపోగానే, తెలుగుదేశం చిత్తు కాగానే.. ముగ్గురు టీడీపీ రాజ్యసభ సభ్యులు.. భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీల్లోకి ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వీరి ఫిరాయింపుకు విలీనం సంతకం పెట్టారు! ఇలాంటి నేపథ్యంలో సుజనా చౌదరి విజయసాయి రెడ్డి ట్వీట్ ఆసక్తిదాయకంగా ఉంది.
ఇక మరో టీడీపీ నేత యనమల రామకృష్ణుడును ఉద్దేశించి విజయసాయి రెడ్డి ఇంకో ఘాటు ట్వీట్ పోస్టు చేశారు. '' రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించి తూర్పు ప్రజలకు ఆగ్రహం తెప్పించొద్దు యనమల గారూ. మిమ్మల్ని తుని ప్రజలు తరిమేశారన్న అక్కసుతో వైజాగ్ వద్దని రంకెలేయడం న్యాయం కాదు. అయినా దీనికి మీ అనుమతి అవసరం లేదు. ప్రజల ఆశీస్సులున్నాయి సిఎం జగన్ గారికి.'' అని ఆ ట్వీట్లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.