తమ నియోజకవర్గం ఎమ్మెల్యే కనపడటం లేదంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో అలా ఫిర్యాదు నమోదు కాగానే.. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడుకు తన నియోజకవర్గం గుర్తుకు వచ్చింది. అలాగని చంద్రబాబు నాయుడు కుప్పానికి వెళ్లలేదు లెండి. కుప్పంలోని టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు నాయుడు తన వద్దకు పిలిపించుకున్నారు.
నియోజకవర్గానికి అందుబాటులో లేని ఎమ్మెల్యేల్లో చంద్రబాబు నాయుడు కూడా ఒకరు అనేది బహిరంగ సత్యం. అందుకు నిదర్శనం ఇటీవలి ఎన్నికల్లో ఆయన మెజారిటీ కూడా చాలా వరకూ తగ్గిపోవడం. తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ లో అయితే చంద్రబాబు నాయుడు వెనుక బడ్డారు. బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో చంద్రబాబు నాయుడు అక్కడ గెలిచారు కానీ, గట్టిగా తగులుకునే నేత ఉండుంటే.. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా అయినా నెగ్గగలిగే వారో లేదో మరి!
అక్కడకూ ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత చాలా హడావుడి చేశారు. ఆయన భార్య భువనేశ్వరి ప్రత్యేకంగా కుప్పం నియోజకవర్గం మీద దృష్టి పెట్టారు. ఇక ఎన్నికలు అయ్యాకా ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు ఒక్కసారి కుప్పానికి వెళ్లారు. అప్పుడు కూడా తన పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికే! ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కనబడటం లేదని కుప్పం నియోజకవర్గంలో ఫిర్యాదు దాఖలైంది.
దీంతో తెలుగుదేశం అధినేతకు కుప్పం గుర్తుకు వచ్చింది. కుప్పంలోని తన మనుషులను పిలిపించుకున్నారు. వారితో మాట్లాడినట్టుగా తన అనుకూల మీడియాలో వార్త రాయించుకున్నారు. ఇదీ కుప్పాన్ని చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ఉద్ధరిస్తున్న తీరు!