ఆల్రెడీ ప్రాంతీయ వాదాలతో సీమాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారు. హైదరాబాద్ ను కోల్పోయి, దిక్కులేని వారయ్యారు. ఐదు దశాబ్దాల పాటు పాలకులు హైదరాబాద్ కే ప్రాధాన్యతను ఇవ్వడం వల్ల జరిగిన నష్టం అది. అభివృద్ధి వికేంద్రీకరణ.. అనేది జరగాలని తెలంగాణ నుంచి విడిపోయినప్పుడు చాలా మంది సీమాంధ్రులు వాపోయారు. అయితే చంద్రబాబు నాయుడుకు మాత్రం అది పట్టలేదు. అమరావతి అంటూ.. మరో హైదరాబాద్ ను పెంచి పోషించే ప్రయత్నం చేశారు ఆయన.
ఆ ప్రయత్నాల కోసం ఆయన మిగితా సీమాంధ్ర గొంతకు కట్టడానికి కూడా వెనుకాడలేదు. ఇలాంటి క్రమంలో అమరావతిలో విపరీతమైన రియలెస్టేట్ హైప్ వచ్చింది. రాజధానికంటూ భూములు ఇచ్చిన వారి సంగతెలా ఉన్నా, ఆ చుట్టుపక్కల భూములు కలిగిన వారు మాత్రం ఇప్పుడు ధర్నాలకు, రాస్తారోకోలకు దిగుతున్నారు.
ధర్నాలు చేస్తున్న వారిలో భూములు ఇచ్చిన వారు లేరని, భూములు ఇచ్చిన వారు ఇప్పుడు తమ భూములు తమకు తిరిగి వస్తాయనే ఆనందంలో ఉన్నారని, రాజధాని వల్ల తమ భూములు రేటు పెరిగిందనుకున్న రియలెస్టేట్ జనాలు మాత్రమే ఇప్పుడు ధర్నాకు దిగుతున్నారనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి.
ఈ క్రమంలో..అక్కడ ధర్నాలు చేస్తున్న వాళ్ల మాటలు మరింత కామెడీగా ఉన్నాయి. ఆ కృత్రిమ ఉద్యమాన్ని తెలుగుదేశం అనుకూల మీడియా హైలెట్ చేస్తూ ఉంది. ఆ వార్తల్లో కామెడీ డైలాగులు మామూలుగా లేవు. అందులో మచ్చుకు ఒకటి ఏమిటంటే.. 'మా 29 గ్రామాలనూ రాజధానిగానే ఉంచాలి. పాలన అంతా ఇక్కడ నుంచినే సాగాలి. లేదంటే మా 29 గ్రామాలనూ కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చండి. దేశానికి రెండో రాజధానిగా మా 29 గ్రామాలనూ ప్రకటించండి..' అని ఒక ఆందోళన కారుడు డిమాండ్ చేశాడట!
ఆఖరికి ఆ జనాల పిచ్చ ఇక్కడి వరకూ వెళ్లినట్టుగా ఉంది. దేశానికి తమ ప్రాంతానికి రెండో రాజధానిగా ప్రకటించాలని, కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేసేంత స్థాయికి వెళ్లిపోయారు. అక్కడికి తమ గ్రామాలున్నదే రాజధాని కావడానికి అన్నట్టుగా ఉంది వీళ్ల కథ!