మన దేశంలో రాష్ట్రపతే ఒక రబ్బర్ స్టాంప్ అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఇప్పుడంటే మీడియాకు అలాంటి మాటలు మాట్లాడే ధైర్యం తక్కువే కానీ, యూపీఏ హయాంలో అయితే.. రాష్ట్రపతి హోదాను కూడా కించపరుస్తూ మీడియాలో కథనాలు వచ్చేవి. ఇక నిన్ననో మొన్ననో.. సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్రపతి ఆఫీసు నుంచి వచ్చిన లెటర్ ను లైట్ తీసుకొమ్మన్నారు. రాష్ట్రపతి ఆఫీసుకు మీరు ఏ ఫిర్యాదు చేసినా.. అందుకు సంబంధించి స్పందన వస్తుందని..ఒక లెటర్ హెడ్ మీద మీరు రాసి పంపిన దాన్నే రాసి పంపిస్తారని.. రాజ్యసభ సభ్యుడి హోదాలో ఉన్న సుజనా చౌదరి వ్యాఖ్యానించారు!
అదీ రాష్ట్రపతి కార్యాలయానికి, రాష్ట్రపతి ఆదేశాలకు.. ఒక ఎంపీ గారు ఇచ్చిన విలువ. ఆ సంగతలా ఉంటే.. రాజధాని అంశం గురించి ఉప రాష్ట్రపతిగారి అభిప్రాయాల గురించి ఒక వర్గం మీడియా తెగ తపించి పోతూ ఉంది! ఒక రోజు ఆయన రాజధాని అంశం గురించి మాట్లాడారంటే.. ఏదో తెలుగువారి కోటాలో అనుకోవచ్చు. అయితే పాలనంతా ఒక చోటే ఉండాలి.. అంటూ ఆయన చెప్పారట. ఇది పతాక శీర్షిక వార్త!
ఆల్రెడీ ఈ రాజధాని ఉద్యమం అంతా ఒక కులం వారిది, ఒక కుల ప్రయోజనాల కోసం జరుగుతున్నది, అక్కడ భూములు కొన్న రాజకీయనేతలు కూడా అదే కులానికి చెందిన వారే.. అనే నిశ్చితాభిప్రాయాలున్నాయి. ఆ నిశ్చితాభిప్రాయాలు ఏర్పడ్డాకా.. మళ్లీ ఉప రాష్ట్రపతి నిశ్చితాభిప్రాయం అంటూ మళ్లీ పతాక శీర్షిక వార్తలు ఎందుకోమరి!
రాజధాని విషయంలో ఉప రాష్ట్రపతి అభిప్రాయం ఏదైనా ఉండొచ్చు, అయితే రాజధాని అనేది ఉప రాష్ట్రపతికి సంబంధించిన వ్యవహారం కాదు. ఉపరాష్ట్రపతి కన్నా మేధావులు, గొప్ప వాళ్లు అయిన వాళ్లు 'పెద్దమనుషుల ఒప్పందం' అంటూ ఒకటి చేసుకున్నారు. దాన్నే శ్రీబాగ్ ఒడంబడికగా వ్యవహరిస్తారు. ఆ శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. అమరావతి రాజధాని అనేది అసలు ఏ మాత్రం చెల్లని వ్యవహారం. ఆ విషయాన్ని ఎందుకు కావాలని విస్మరిస్తున్నారో, ఒక వర్గం మీడియా దాన్ని ఎందుకు గుర్తు చేయడం లేదో!