ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన మోడీ మనకు హీరో. అన్ని ప్రాంతాల్లో సమాన అభివృద్ధి జరగాలంటూ మూడు రాజధానులపై ప్రకటన చేసిన జగన్ మనకు విలన్. అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతుల తీరు చూస్తుంటే ఎవరికైనా ఇదెక్కడి చోద్యం అనిపించక మానదు.
మోడీ, అమిత్ షా ఫొటోలను పట్టుకుని నినాదాలు చేస్తున్న రైతులు.. జగన్ పై ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తూమంటూ వీరంగం వేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడండి అంటూ తలా ఒక లేఖ రాశారు. చంద్రబాబు వ్యూహం కూడా ఇదే. రాజధానుల అంశాన్ని అడ్డం పెట్టుకుని మోడీ భజన మొదలు పెట్టారు బాబు. ఆందోళన కార్యక్రమాల్లో మోడీని హీరోలా చిత్రీకరించే ప్రణాళికను అమలు చేస్తున్నారు. అదే సమయంలో అనుకూల మీడియా ద్వారా మోడీ, షా ఫొటోల్ని హైలెట్ అయ్యేలా చేస్తున్నారు.
మోడీ హీరో, జగన్ విలన్ అనే భావం వచ్చేలా రైతులు చేస్తున్న ఆందోళనలు మలుపు తీసుకున్నాయి. దేశానికి ప్రధాన మంత్రి అయినంత మాత్రాన, ఒక రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో ఆయన నిర్ణయించగలరా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాన్ని ఆయన అడ్డుకోగలరా? ఈ విషయాలు చంద్రబాబుకి తెలియక కాదు, కానీ జగన్ ని టార్గెట్ చేయాలంటే.. ఆయనకు ఓ బలమైన సపోర్ట్ కావాలి. అందుకే మోడీని అడ్డం పెట్టుకుని బ్లేమ్ గేమ్ షురూ చేశారు చంద్రబాబు.
మూడు ప్రాంతాల అభివృద్ధికి తాను వ్యతిరేకం కాదంటూనే అమరావతి రైతుల తరపున మొసలి కన్నీరు కారుస్తున్నారు చంద్రబాబు. అయితే మోడీకి కానీ, అమిత్ షాకి కానీ ఏపీ రాజధానిపై స్పందించేంత తీరిక కానీ, ధైర్యం కానీ లేవనేది బహిరంగ రహస్యం. వరుస అపజయాలతో తల బొప్పికట్టగా.. మరోవైపు పౌరసత్వ సవరణ చట్టంతో దేశమంతా అట్టుడికిపోతుంటే, తాము రంగంలోకి దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
ఈ విషయాలన్నీ తెలిసినా చంద్రబాబు మాత్రం మోడీని అడ్డం పెట్టుకుని రైతుల్ని రెచ్చగొడుతున్నారు. జగన్ పై చెలరేగిపోతున్నారు. రాజధాని అంశాన్ని ఎంత వివాదాస్పదం చేయాలో అంతా చేస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే ఇదేనేమో