అధికారంలో ఉన్నప్పుడు విశాఖ మీద చంద్రబాబు నాయుడు అపారమైన ప్రేమను వ్యక్తం చేశారు. అయితే ఆ ప్రేమ అంతా మాటల్లోనే! రాజధాని విషయంలో విశాఖను చంద్రబాబు నాయుడు పరిగణనలోకి తీసుకోలేదు. అంతా అమరావతికే అనే తన థియరీ ప్రకారం, ఉత్తరాంధ్రకు ఏమీ అవసరం లేదు- రాయలసీమకు మరేం దక్కదు.. అన్నట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. ఆ క్రమంలో విశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ఫార్ములాను చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అంతా అమరావతికే దక్కాలి తప్ప.. రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ఏం దక్కకూడదు అని చంద్రబాబు నాయుడు చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంతాలపై విషం చిమ్మేలా వ్యాఖ్యానించడానికి కూడా చంద్రబాబు నాయుడు వెనుకాడకపోవడం గమనార్హం.
తను ఒక రాజకీయ పార్టీ అధినేతను, తన పార్టీకి మూడు ప్రాంతాలూ అవసరమే అనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. విశాఖ విషయంలో రాయలసీమ వాళ్ల వద్ద చంద్రబాబు నాయుడు విషం వ్యాఖ్యానాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాయలసీమ గురించి విశాఖ వాళ్ల వద్ద వ్యతిరేకత…ఇదీ చంద్రబాబు నాయుడి వ్యూహంగా తెలుస్తోంది.
'కుప్పానికి విశాఖ దూరం..*'అంటూ రాయలసీమ వాళ్ల వద్ద.. చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారని ఆయన అనుకూల మీడియానే చెబుతూ ఉంది. ఇక రాయలసీమ మీద కూడా చంద్రబాబు నాయుడు అనేక సార్లు అనుచిత వ్యాఖ్యానాలు చేశారు. ఇలా ఒక ప్రాంతం వారి వద్ద మరో ప్రాంతాన్ని బూచిగా చూపించేప ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.
అటు ఉత్తరాంధ్రపై రాయలసీమలో ద్వేషాన్ని పెంచి, రాయలసీమను ఉత్తరాంధ్రకు బూచిగా చూపి.. మధ్యలో తన డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి విషయంలో అనుకూలత పెంచుకోవాలనే కుటిల ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు అమల్లో పెడుతున్నట్టుగా ఉన్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.