షాకిస్తున్న ఉల్లి ధరల్ని నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈజిప్ట్ నుంచి ఉల్లిని అధిక మొత్తంలో దిగుమతి చేసింది. దాదాపు 30 టన్నుల ఈజిప్ట్ ఉల్లి, నిన్నట్నుంచి హైదరాబాద్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.
కిలో 40 రూపాయల వద్ద ప్రారంభమైన ఉల్లి ధర, రోజురోజుకు పెరుగుతూ ఒక దశలో కిలో 150 రూపాయలకు కూడా చేరుకుంది. దీంతో సామాన్యులు విలవిల్లాడారు. ప్రభుత్వం వద్ద ఉన్న ఉల్లి స్టాక్ మొత్తాన్ని మార్కెట్లోకి విడిచిపెట్టినా ధర తగ్గలేదు. దీంతో ఏకంగా ఈజిప్ట్ నుంచి ఉల్లిని దిగుమతి చేసింది తెలంగాణ సర్కార్.
ఈజిప్ట్ ఉల్లిని కిలో 40 రూపాయల చొప్పున సబ్సిడీ కింద రైతుబజార్లలో విక్రయిస్తోంది. మరో 3 రోజులు చూసి అప్పటికీ డిమాండ్ తగ్గకపోతే, మరో 30 టన్నుల్ని దిగుమతి చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇండియా ఉల్లికి, ఈజిప్ట్ ఉల్లికి ఎలాంటి తేడా ఉండదని.. ఘాటు, రుచి విషయంలో రెండూ ఒకేలా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఎలాంటి అపోహలు పడకుండా వినియోగదారులు సబ్సిడీలో ఈ ఉల్లిని తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిధర 60-70 రూపాయల మధ్య పలుకుతోంది. సంక్రాంతి వరకు ఈ ధరలు ఇలానే ఉండొచ్చని భావిస్తున్నారు. సంక్రాంతి టైమ్ కు కొత్త పంట చేతికొస్తుందని, అప్పుడు ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అప్పటికీ ధరలు తగ్గకపోతే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునేందుకు రెడీ అవుతున్నారు అధికారులు