‘శ్రీ‌బాగ్‌’ నివాసంలో పెరిగిన వైఎస్ జ‌గ‌న్‌

శ్రీ‌బాగ్‌…మ‌ద్రాస్‌లోని కాశీనాధుని నాగేశ్వ‌ర‌రావు నివాసం పేరు శ్రీ‌బాగ్‌. ఆ ఇంట్లో 1937, న‌వంబ‌ర్ 16న కోస్తా, రాయ‌ల‌సీమ నాయ‌కుల మ‌ధ్య ఓ ఒప్పందం జ‌రిగింది. దాన్నే శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక అంటారు. ఈ ఒడంబ‌డిక ప్ర‌కారం…

శ్రీ‌బాగ్‌…మ‌ద్రాస్‌లోని కాశీనాధుని నాగేశ్వ‌ర‌రావు నివాసం పేరు శ్రీ‌బాగ్‌. ఆ ఇంట్లో 1937, న‌వంబ‌ర్ 16న కోస్తా, రాయ‌ల‌సీమ నాయ‌కుల మ‌ధ్య ఓ ఒప్పందం జ‌రిగింది. దాన్నే శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక అంటారు. ఈ ఒడంబ‌డిక ప్ర‌కారం రాయ‌ల‌సీమ‌కు రాజ‌ధాని లేదా హైకోర్టు రావాలి. అలాగే సాగునీటి విష‌యంలో రాయ‌ల‌సీమ‌కే మొద‌టి ప్రాధాన్యం.

శ్రీ‌బాగ్‌…హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్‌నంబ‌ర్ 3లో ఓ ప్ర‌ముఖ రాజ‌కీయ నేత నివాసానికి కూడా శ్రీ‌బాగ్ అనే పేరు పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత కాలంలో ఆయ‌న  ముఖ్య‌మంత్రిగా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేశారు. ఈ వాక్యాలు ఎవ‌రి గురించో ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేని ఆ పాల‌కుడే డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.

చాలా మందికి ఆయ‌న త‌న నివాసానికి శ్రీ‌బాగ్ అనే పేరు పెట్టుకున్నార‌ని తెలియ‌దు. అయితే రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారుల‌కి ఈ విష‌యం బాగా తెలుసు. డాక్ట‌ర్ వైఎస్సార్‌కి శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక అంటే ఓ భ‌గ‌వ‌ద్గీత‌, బైబిల్‌, ఖురాన్‌తో స‌మానం. ఎందుకంటే రాయ‌ల‌సీమ క‌రవు పోవాలంటే శ్రీ‌బాగ్ ఒడంబ‌డిక అమ‌లు కావ‌డమే అంతిమ ప‌రిష్కార‌మ‌ని ఆయ‌న గాఢంగా న‌మ్మేవారు.

రాయ‌ల‌సీమ‌లో సాగునీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ప్రాజెక్టులు నిర్మించాలంటూ ఎమ్మెల్యేల‌తో క‌ల‌సి ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టారు. అలాగే అనంత‌పురం జిల్లా లేపాక్షి నుంచి క‌ర్నూలు జిల్లా పోతిరెడ్డిపాడు వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు. శ్రీ‌బాగ్ అని త‌న నివాసానికి పేరు పెట్టుకోవ‌డంలోనే వైఎస్సార్‌కు రాయ‌ల‌సీమ‌తో పాటు క‌ర‌వు ప్రాంత రైతాంగంపై ప్ర‌త్యేక ప్రేమ‌ను తెలియ‌జేస్తోంది.

డాక్ట‌ర్ వైఎస్సార్ త‌న‌యుడు, ప్ర‌స్తుత ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బంజారాహిల్స్‌లోని రోడ్‌నంబ‌ర్ 3లోని శ్రీ‌బాగ్ నివాసంలో పెరిగాడు. హైద్రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌కు ఆ ఇంటి నుంచే వెళ్లేవాడు. తండ్రి నుంచి సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ అవ‌గాహ‌న‌ను పెంపొందించుకున్నాడు. బాల్యంలో జ‌గ‌న్‌కు రాజ‌కీయాల‌పై ఆస‌క్తికి శ్రీ‌బాగ్ నివాస‌మే కేంద్రం. బ‌హుశా శ్రీ‌బాగ్ నివాసంలో పెర‌గ‌డం వ‌ల్లేమో జ‌గ‌న్‌కు మ‌రీ ముఖ్యంగా రైతుల‌పై ప్రేమ‌, సాగునీటి ప్రాజెక్టుల‌పై అపార‌మైన ప‌ట్టు ఉంది.

ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు డాక్ట‌ర్ ఎల్వీకేకు జ‌గ‌న్ మాతృమూర్తి వైఎస్ విజ‌య‌మ్మ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ‘జ‌గ‌న్‌కు చాలా విష‌యాలు నాన్న వైఎస్ విశ్లేషించి చెబుతుండేవారు. ఏ ప్రాజెక్టు ఏమిటి దాని వివ‌రాలేమిటి అనే విష‌యాలు వివ‌రిస్తూ ఉండేవారు. ఆ రోజు సెప్టెంబ‌ర్ 2వ తేదీ కూడా ప్ర‌కాశం బ్యారేజీ గురించి జ‌గ‌న్ ప్ర‌స్తావిస్తే…ఆయ‌న నీటి ప్రాజెక్టుల గురించి చాలా వివ‌రాలు చెప్పారు. రాబోయే మూడేళ్ల‌లో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేయాలి. ప్రాణహిత చేవెళ్ల‌కు కూడా అత్య‌ధిక ప్రాధాన్యం ఇవ్వాలి అనే త‌న కోరిక‌ను స్ప‌ష్టం చేశారు’  అని పేర్కొన్నారు.

సీఎం అయ్యాక ఆ ఇంటిని డాక్ట‌ర్ వైఎస్సార్ ప‌లు కార‌ణాల రీత్యా విక్ర‌యించార‌ని తెలిసింది. కానీ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను త‌యారు చేయ‌డంలో ఆ ఇంటిలో సాగిన మేధోమ‌ధ‌నమే కార‌ణమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.