కేబినెట్ వేదిక మారిస్తే పలాయనమే!

సాధారణంగా నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ మొత్తం దానిని అద్భుతం అని శ్లాఘిస్తారు. కానీ.. ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు.. వారికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని బయట పెట్టరు. అలా ప్రాక్టికల్ దృక్కోణంలోంచి చూసినప్పుడు.. శుక్రవారం…

సాధారణంగా నాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ మొత్తం దానిని అద్భుతం అని శ్లాఘిస్తారు. కానీ.. ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పుడు.. వారికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. వాటిని బయట పెట్టరు. అలా ప్రాక్టికల్ దృక్కోణంలోంచి చూసినప్పుడు.. శుక్రవారం జరగనున్న కేబినెట్ భేటీని అమరావతిలో నిర్వహించకుండా విశాఖలో నిర్వహించాలని జగన్మోహనరెడ్డి నిర్ణయిస్తే గనుక.. అది ఖచ్చితంగా పలాయనం చిత్తగించడమే అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైఎస్ జగన్.. రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. దీని మీద రాష్ట్రమంతా హర్షాతిరేకాలు ఎలాగైతే వ్యక్తం అవుతున్నాయో అదే తరహాలో అమరావతి ప్రాంతంలో నిరసనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన నిరసనలే గనుక.. ప్రభుత్వం వీటిని ఖాతరు చేయాల్సిన అవసరం లేదు.

ఇలాంటి నేపథ్యంలో శుక్రవారం.. ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ప్రస్తుతానికి ఈ కేబినెట్ భేటీ అమరావతిలోనే జరుగుతుందని అనుకుంటున్నారు. అంటే వెలగపూడి సచివాలయంలోనే కేబినెట్ భేటీ జరగనున్నదనేది సమాచారం. కాకపోతే.. అమరావతి ప్రాంతంలో.. జగన్ నిర్ణయంతో హతాశులైన రియల్ దందాలకు పాల్పడే వారి నిరసనలు మిన్నంటుతున్నాయి. రోడ్లను స్తంభింపజేస్తున్నారు. ఇలాంటి నిరసనల నేపథ్యంలో కేబినెట్ భేటీని విశాఖలో నిర్వహించడానికి ఆలోచిస్తున్నారనే ప్రచారమూ తెరమీదకు వస్తోంది.

జగన్ ఇలాంటి నిర్ణయాన్ని కేబినెట్ భేటీకి ముహూర్తం పెట్టినప్పుడే ప్రకటించి ఉంటే మరోరకంగా ఉండేది. కానీ, నిరసనల నేపథ్యంలో వేదికను విశాఖకు మారిస్తే మాత్రం.. ప్రజాందోళనలకు ప్రభుత్వం భయపడినట్లుగా, పలాయనం చిత్తగించినట్లుగా కనిపిస్తుంది. విశాఖలో కేబినెట్ భేటీ ఉంటుందనే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

పోలీసులు తమ  వంతు ముందు జాగ్రత్త చర్యలుగా.. సచివాలయం మార్గంలోని ఊర్లన్నింటిలో నిరసనలు వెలిబుచ్చకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ గ్రామాల ప్రజలకు ఇప్పటికే నోటీసులు జారీచేశారు. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎన్ని ఉన్నప్పటికీ.. ప్రజలు ఏదో రీతిగా నిరసనలు తెలియజెప్పే ప్రమాదం తప్పకుండా ఉంటుంది. అంత మాత్రాన ప్రభుత్వం విశాఖలో భేటీ పెట్టడం సరికాదు.

పరిపాలన ఎప్పటిలాగానే.. సాధారణ క్రమంలో నడిపిస్తూ.. అసంతృప్తులకు నచ్చజెప్పడమూ.. పైచేయి సాధించడమూ చేయాలి తప్ప.. ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటే ప్రభుత్వం భయపడినట్లు ఉంటుంది.ఇలాంటి నిర్ణయం వస్తే.. పార్టీ నాయకులంతా దానిని సమర్థిస్తూ రకరకాల కథలు చెప్పవచ్చు గానీ.. వాస్తవంలో మాత్రం.. అది పలాయనమే అనిపించుకుంటుంది.