ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై తీవ్ర చర్చ జరుగుతన్న నేపథ్యంలో రాయలసీమ స్వరం సవరించుకుంటోంది. కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ ఇప్పటికే అనధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17న అసెంబ్లీ వేదికగా జగన్ ప్రకటించిన తర్వాత రెండు మూడు రోజులు రాయలసీమ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే కేవలం హైకోర్టు వల్ల ఒరిగేదేమీ లేదని, రాజధానే కావాలని రాయలసీమ ఉద్యమకారులు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
రాయలసీమ కోసం 1984-85లో ఉద్యమాలు చేసిన మాజీ మంత్రి డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి కర్నూల్‌లో కేవలం హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన ప్రయోజనం లేదని వాదిస్తున్నారు. అంతేకాదు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమకు రాజధాని లేదా ప్రత్యేక రాష్ట్రమా? ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు రాయలసీమలో టీడీపీ నేతలు కూడా నెమ్మదిగా జగన్ దెబ్బ నుంచి కోలుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ధైర్యం చేసి మూడు రాజధానులపై గొంతు సవరించుకుంటున్నారు. రాయలసీమకు రాజధాని ఇవ్వాలని లేదంటే అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ సీఎం జగన్ మూడు రాజధానులపై వెనక్కి తగ్గకపోతే డాక్టర్ ఎంవీ మైసూరారెడ్డి, ఇతర ఉద్యమనాయకులతో కలసి కర్నూల్‌కు రాజధాని , లేదంటే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరు ఉధృతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నేతలు గ్రేటర్ రాయలసీమగా ఏర్పడి రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ సీఎం జగన్‌కు బుధవారం లేఖ రాశారు. పరిపాలన వికేంద్రీకరణను సమర్ధిస్తు న్నామని చెప్పారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు ఏర్పాటు హర్షణీయమని సీమ నేతలు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై మైసూరారెడ్డి (కడప), గంగుల ప్రతాప్‌రెడ్డి (కర్నూల్), శైలజానాథ్ (అనంతపురం), చెంగారెడ్డి (చిత్తూరు), మాజీ డీజీపీలు ఆంజనేయరెడ్డి , దినేష్‌రెడ్డి (నెల్లూరు) సంతకాలు చేశారు.
విశాఖలోనే రాజధాని ఉంటే రాయలసీమ వాసులకు ఇబ్బందులు తప్పవని, ఉద్యమాలు మొదలయ్యే అవకాశం ఉందని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ ఇప్పటికే హెచ్చరించారు. ఒకవైపు రాయలసీమకు హైకోర్టు ఇస్తామని ప్రకటిస్తూనే, మరోవైపు అమరావతి, విశాఖలలో హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై సీమవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకూ కర్నూల్‌లో ఏర్పాటు చేసేది హైకోర్టా లేక రాయలసీమ బెంచా అని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. రాయలసీమ వాసి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఇక్కడి ప్రజలకు ఒరిగేదేమీ లేదని సీమ మేధావులు, ఉద్యమకారులు అంటున్నారు. ఈ నెల 27న కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాన్ని బట్టి సీమ ఉద్యమ కార్యాచరణ నిర్ణయిస్తామని అంటున్నారు. మొత్తానికి రాయలసీమలో ఎనిమిది రోజుల క్రితం ఉన్న రాజకీయ వాతావరణంలో క్రమంగా మార్పు వస్తోంది. విశాఖకు రాజధాని పోతే మాకేంటి ? అనే ప్రశ్నే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. ఈ ప్రశ్న ఎటు దారి తీస్తుందో కాలమే జవాబు చెప్పాలి.
సీమకు రాజధానా? ప‌్రత్యేక రాష్ట్రమా?
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై తీవ్ర చర్చ జరుగుతన్న నేపథ్యంలో రాయలసీమ స్వరం సవరించుకుంటోంది. కర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని జగన్ సర్కార్ ఇప్పటికే అనధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17న అసెంబ్లీ వేదికగా…