cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: ఇద్దరి లోకం ఒకటే

సినిమా రివ్యూ: ఇద్దరి లోకం ఒకటే

సమీక్ష: ఇద్దరి లోకం ఒకటే
రేటింగ్‌: 2/5
బ్యానర్‌:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: రాజ్‌ తరుణ్‌, షాలిని పాండే, నాజర్‌, రోహిణి, భరత్‌, రాజా, సిజ్జు తదితరులు
మాటలు: అబ్బూరి రవి
సంగీతం: మిక్కీ జె. మేయర్‌
ఛాయాగ్రహణం: సమీర్‌ రెడ్డి
నిర్మాత: శిరీష్‌
కథనం, దర్శకత్వం: జి.ఆర్‌. కృష్ణ
విడుదల తేదీ: డిసెంబర్‌ 25, 2019

ఒక ట్రాజిక్‌ లవ్‌స్టోరీని కూడా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పవచ్చునని ముప్పయ్యేళ్ల క్రితమే మణిరత్నం 'గీతాంజలి'తో చూపించారు. అలాంటిది ఈ రోజుల్లో లవ్‌స్టోరీని ఇంతటి మెలోడ్రమెటిక్‌గా చెబుతూ కనీసం ఓ ప్రేమకథ పండడానికి అవసరమయిన మంచి సంగీతం, లేదా వాస్తవికమైన సంఘటనలు, పాత్రలు సృష్టించకపోవడంలోనే తమ అలసత్వాన్ని చాటుకున్నారు. టర్కిష్‌ రొమాన్స్‌ డ్రామా 'లవ్‌ లైక్స్‌ కోఇన్సిడెన్సెస్‌' చిత్రానికి అధికారిక రీమేక్‌ అయిన ఈ చిత్రం రాకముందే ఆ చిత్రంలోని ఎసెన్స్‌ని పలు చిత్రాల్లో వాడేసారు. తెలుగులోనే ఇటీవల వచ్చిన పలు ప్రేమకథా చిత్రాల్లో ఆ టర్కిష్‌ సినిమా ఛాయలు కనిపించాయి. ఇక అధికారికంగా రీమేక్‌ చేసుకున్న ఈ చిత్రంలో ఒరిజినల్‌కి విశ్వాసంగా కట్టుబడి వున్నారనేది మినహాయిస్తే ఇంక ఏ విధమైన ఫ్రెష్‌నెస్‌ లేదు. పైగా డల్‌గా మాట్లాడుతూ, డల్‌గా తిరిగే లీడ్‌ క్యారెక్టర్‌తో పాటు మిగిలిన పాత్రలు అన్నిట్లోను అదే నిర్లిప్తత, నీరసం తప్ప హుషారుగా ఒక్క పాత్రని కూడా తీర్చిదిద్దలేదు.

కనీసం హీరో స్నేహితుల వైపునుంచో లేదా హీరోయిన్‌తో కలిసి సాగే సరదా సన్నివేశాల నుంచో హుషారు నింపడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా కనిపించే రాజ్‌ తరుణ్‌తో ఇలాంటి నీరసమయిన పాత్ర చేయించడం ఎంత మాత్రం సమంజసమనిపించుకోదు. అసలే పరాజయాలతో నీరసించి వున్నాడేమో ఈ పాత్రని రక్తి కట్టించాలనే తపన కూడా అతనిలో ఎక్కడా కనిపించలేదు. వెంటిలేటర్‌పై రోజుల తరబడి వున్న వ్యక్తి పట్ల హోప్స్‌ వదిలేసుకున్నట్టుగా ఈ సినిమా మేకింగ్‌ పరంగా, యాక్టింగ్‌ పరంగా అదో రకం స్తబ్ధత సినిమా అంతటా వ్యాపించి విసుగు అనే పదానికి అర్థాన్ని సెవెంటీ ఎంఎంలో చూపించినట్టనిపించింది. ఇంటర్వెల్‌కి ముందు రివీల్‌ అయ్యే హీరో హెల్త్‌ కండిషన్‌తో అయినా ఏదయినా టెన్షన్‌కి స్కోప్‌ వుంటుందేమో అంటే అదేమీ జరగకపోగా అప్పట్నుంచీ సినిమా అంతటికీ హీరో హీరోయిన్లిద్దరే లోకమయ్యారు.

పీక్‌ అవర్‌లో బంపర్‌ టు బంపర్‌ ట్రాఫిక్‌లో వెళ్లే కార్‌లా కాకుండా కనీసం ఒక్క గేరు మార్చి ఇరవై, ముప్పయ్‌ స్పీడ్‌లో వెళ్లినా కొద్దిగా అయినా ఉపశమనం లభించేదేమో. హీరో తాలూకు హెల్త్‌ కండిషన్‌ వల్ల అతనికి ఎప్పుడేమి అవుతుందోననే ఆందోళన కలగాలి. కానీ అదేదో త్వరగా అయిపోతే ఈ వ్యధ ముగిసిపోతుందనిపించేతగా ఈ చిత్రం విసిగిస్తుంది. దాదాపు ఎనభై శాతం సన్నివేశాలు, సంభాషణలు హీరో హీరోయిన్లపైనే వుంటాయన్నపుడు వారి మధ్య స్వీట్‌ నథింగ్స్‌ ఎంత టచింగ్‌గా వుండాలి? వాళ్లేదో మాట్లాడుకుంటూనే వుంటారు కానీ ఏదీ మన చెవులని దాటి మెదడుకి చేరదు. వాళ్లేదో ఎమోషనల్‌గా ఫీలయిపోతూనే వుంటారు కానీ ఏదీ కళ్లని దాటి మనసుని తాకదు.  హోప్‌లెస్‌ అని తేల్చేసిన పేషెంట్‌ దగ్గర హార్ట్‌రేట్‌ మానిటర్‌లో ఫ్లాట్‌ లైన్‌ కోసం ఎదురు చూస్తోన్నట్టుగా అంతా మెకానికల్‌గా సాగిపోతూ వుంటుంది. ఈ చిత్రానికి పని చేస్తోన్న వారందరికీ ఫలితం ఏమిటో ముందే తెలిసినా కానీ మొదలు పెట్టాం కాబట్టి పూర్తి చేయాలనే ఫీలింగ్‌ వచ్చిందో ఏమో ఛాయాగ్రహణం మినహా మిగిలిన శాఖలన్నిట్లోను 'తూ తూ మంత్రం' పనితనమే కనిపిస్తుంది.

రాజ్‌ తరుణ్‌కి ఈ పాత్ర సూటవ్వలేదు. మంద్ర స్వరంతో మాట్లాడుతూ మౌనంగా బాధని అనుభవించే ఈ పాత్రని ఎవరైనా కాస్త పెద్ద వయసున్న వారికి ఆఫర్‌ చేసి వుండాల్సింది. షాలిని పాండే చూడ్డానికి క్యూట్‌గా వుంది. ఆమె పర్‌ఫార్మెన్స్‌ జస్ట్‌ ఓకే అనిపిస్తుంది. మిగిలిన వారంతా స్టాక్‌ క్యారెక్టర్స్‌ చేయగా, రోహిణికి మాత్రం నటించడానికి స్కోప్‌ వున్న లాస్ట్‌ సీన్‌ దక్కింది. ఆటలో అరటిపండు పాత్రలకి రాజా పెట్టింది పేరయిపోతున్నట్టుంది. ఛైల్డ్‌ ఆర్టిస్ట్‌గా విపరీతంగా నవ్వించిన భరత్‌తో ఒక్క జోక్‌ కూడా చెప్పించలేకపోవడంలో రైటర్ల లేజీనెస్‌ తెలుస్తుంది.

మిక్కీ జె. మేయర్‌ పాటలు కథానుగుణంగా వున్నాయి కానీ ఒక్కటి కూడా క్యాచీగా లేదు. వున్నవాటిలో యు ఆర్‌ మై హార్ట్‌ బీట్‌ ఒక్కటీ ఫర్వాలేదు. నేపథ్య సంగీతం రెగ్యులర్‌గానే వుంది. సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ వల్ల సినిమాలో ప్రతి ఫ్రేమ్‌ కలర్‌ఫుల్‌గా వుంది. ఊటీని ఆయన క్యాప్చర్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. రెండు గంటల పైచిలుకు నిడివి వున్న ఈ చిత్రం ఓ అరగంట ఎక్కువే సాగినట్టనిపిస్తుంది. డైలాగ్స్‌లో ఒక్కటి కూడా ఇంపాక్ట్‌ వేయలేకపోయింది. క్వాలిటీ విషయంలో దిల్‌ రాజు మళ్లీ రాజీ పడలేదు. దర్శకుడు కృష్ణ ఒక టచింగ్‌ లవ్‌స్టోరీ తీద్దామని కృషి చేసాడు కానీ ఈ ప్రేమ జంటతో కనక్ట్‌ ఏర్పరచడంలో విఫలమయ్యాడు. పతాక సన్నివేశాలు మినహా దర్శకత్వ ప్రతిభ ఎక్కడా కనిపించలేదు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కన పెట్టి ఎమోషనల్‌ లవ్‌స్టోరీ తీయాలనే ప్రయత్నం తప్పు కాదు కానీ అలా ఎమోషనల్‌గా కనక్ట్‌ చేయలేనపుడు ఆ ప్రయత్నమే వ్యర్ధమనిపిస్తుంది. ఒక మామూలు చిత్రాన్ని కూడా ఏదో ఒకలా తన మార్కెటింగ్‌ గిమ్మిక్స్‌తో ఒడ్డున పడేయగల దిల్‌ రాజు బ్యానర్లో లవర్‌ తర్వాత మళ్లీ ఇలాంటి సినిమా పడడం రాజ్‌ తరుణ్‌ దురదృష్టం అనుకోవాలి.

బాటమ్‌ లైన్‌: ఒకటే నిద్దుర మైకం!

గణేష్‌ రావూరి

 


×