మహేష్ ఫ్యాన్స్ తొక్కిసలాట

తమ అభిమాన హీరోతో ఫొటో దిగాలన్నది ఫ్యాన్స్ కు ముచ్చట. అందుకే ఈ మధ్య కొనేళ్లుగా టాప్ హీరోలు తమ సినిమా విడుదల ముందు, ఫ్యాన్స్ ను పిలిచి ఫొటోలు దిగే కార్యక్రమం చేస్తున్నారు.…

తమ అభిమాన హీరోతో ఫొటో దిగాలన్నది ఫ్యాన్స్ కు ముచ్చట. అందుకే ఈ మధ్య కొనేళ్లుగా టాప్ హీరోలు తమ సినిమా విడుదల ముందు, ఫ్యాన్స్ ను పిలిచి ఫొటోలు దిగే కార్యక్రమం చేస్తున్నారు. సీనియర్ హీరో బాలయ్య నుంచి యంగ్ హీరోలు, మహేష్, ఎన్టీఆర్ లాంటి వాళ్లు ప్రతి సినిమా ముందు ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదే విధంగా సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఫొటో సెషన్ ఏర్పాటు చేసారు.

అయితే ఈ ఫొటో సెషన్ కాస్తా, గందర గోళానికి దారి తీసింది. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ రావడం, వారు ఒకరిని ఒకరు తోసుకోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. యూనిట్ ఏర్పాట్లు చేసిన బౌన్సర్ల సెటప్, ఫ్యాన్స్ సంఖ్య ముందు ఆగలేకపోయింది. దీంతో ఫ్యాన్స్ మూకుమ్మడిగా ఫొటో సెషన్ వేదిక అయిన అల్యూమినియం ఫ్యాక్టరీలోకి తోసుకవెళ్లారు. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి. ఒకరిద్దరికి కాళ్లు విరిగినట్లు బోగట్టా. వారిని ఆసుపత్రిలో చేర్పించారు.

దీంతో మహేష్ బాబు అర్థాంతరంగా కార్యక్రమం నిలిపి వేసి, వెళ్లిపోయారని తెలుస్తోంది. గత రెండు రోజులుగా ట్విట్టర్ లో కూడా ఈ ఫొటో సెషన్ మీద గడబిడ నడుస్తోంది. ఫ్యాన్స్ ఈ విషయంలో వారిలో వారు కిందా మీదా అవుతున్నారు. మహర్షి సినిమా టైమ్ లో కూడా ఫొటో సెషన్ లు మూడు రోజుల పాటు నిర్వహించారు కానీ ఏ సమస్యా రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాస్త తేడా వచ్చింది.