జగన్మోహన రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను శాసనసభ ముందు ప్రకటించారు. దాని మీద ఒక్కొక్కరూ ఒక్కొక్క తరహాలో మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం నాయకులు కూడా తొలుత కొందరు దానిని సమర్థించారు. తర్వాత నాలుక మడత పెట్టారు. ఇప్పుడు అంతకంటె వంకరగా మాట్లాడుతున్నారు. వారిలో తనకంటె వంకరగా మరొకరు మాట్లాడడం సాధ్యం కాదన్నట్లుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాటలు రువ్వుతున్నారు.
ఇదే గంటా శ్రీనివాసరావు గతంలో విశాఖపట్టణంలో రాజధాని అనగానే దానిని సమర్థిస్తూ ప్రకటన చేశారు. తర్వాత ఏమైందో ఏమో.. ఇప్పుడు దానిమీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని కావడం సంతోషమే కానీ.. అనుమానాలు ఉన్నాయంటున్నారు. ఇంతకూ ఆయన వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటో తెలుసా..?
జీవీఎంసీ ఎన్నికల కోసమే రాజధాని నగరం అనే ప్రకటన చేశారని అనిపిస్తోందంటూ.. గంటా అంటున్నారు. ఇంతకంటె నేలబారుగా మరొకరు మాట్లాడడం సాధ్యం కాదేమో. గంటా చెబుతున్న దాన్ని బట్టి.. జగన్ తన ప్రభుత్వంలో ఏ నగరానికి కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతోంటే.. ఆ నగారన్ని రాజధానిగా ప్రకటిస్తూ పోతారన్నమాట. ఈ లెక్కన రాష్ట్రంలో ఎన్ని కార్పొరేషన్లు ఉంటే.. అన్ని రాజధానులు కూడా ఏర్పాటవుతాయేమో.. అనిపించేలా గంటా మాట్లాడుతున్నారు.
విశాఖ ప్రాంతానికే చెందిన నాయకుడే అయి ఉండి కూడా.. తమ ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తోంటే.. ఇలాటి వంకర మాటలను ఆయన ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. తెలుగుదేశం నాయకులకు నిజంగానే అంత చిత్తశుద్ధి ఉంటే.. రాష్ట్ర సమష్టి ప్రయోజనాలకోసం, సమతుల్య అభివృద్ధి కోసం.. ఈ అధికార కేంద్రాల వికేంద్రీకరణను సమర్థించాలి. అన్ని ప్రాంతాల ప్రజలు సంతుష్టిగా ఉండేలా.. చూడాలి. జగన్ చేస్తున్న మంచి ఆలోచనకు మద్దతుగా నిలవాలి. అంతే తప్ప.. రాజకీయ ప్రయోజనాల కోసం, స్వల్పకాలికమైన తుచ్ఛమైన రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకోసం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని మాట్లాడడం ద్రోహం అనిపించుకుంటుంది.