చంద్రబాబులో ఎంత మార్పు. ఓటమికి ఎంత శక్తి వుందో కుప్పం నియోజకవర్గ ప్రజలు నిరూపించారు. తనను ఆరేడు సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గ ప్రజల యోగక్షేమాల గురించి ఏనాడూ పట్టించుకోని చంద్రబాబు…కొన్ని నెలల క్రితం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోవడం ఆయన్ను అప్రమత్తం చేసింది. ఏ మాత్రం సమయం దొరికినా తన నియోజకవర్గ ప్రజలతో గడిపేందుకు ఆయన ఆసక్తి చూపుతుండడం విశేషం.
బాబులో వచ్చిన మార్పునకు కుప్పం టీడీపీ శ్రేణులు సంతోషిస్తున్నాయి. ఇటీవల వరుసగా కుప్పంలో చంద్రబాబు పర్యటిస్తుండడాన్ని గమనించొచ్చు. అలాగే అమరావతికి కుప్పం టీడీపీ నాయకులను పిలిపించుకుని, ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన నూతన సంవత్సరంలో జనవరి మొదటి వారంలో తన నియోజకవర్గంలో పర్యటించడానికి నిర్ణయించుకోవడం గమనార్హం.
ఈ విషయమై కుప్పం టీడీపీ నేతలతో ఆయన చెప్పారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో తానే రంగంలో దిగితే తప్ప అక్కడ పార్టీ బతికి బట్ట కట్టదనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు.
తన గెలుపుపైనే సందేహాలొస్తే… రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు దిగాలు పడుతాయని ఆయన ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆ పరిస్థితి తలెత్తకుండా చంద్రబాబు అప్రమత్తం కావడాన్ని గమనించొచ్చు. ఇదంతా ఓటమి తీసుకొచ్చిన మార్పుగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.