బీసీలపై టీడీపీ ప‌ట్టు స‌డ‌లిపోవ‌డానికి సాక్ష్యం!

పూర్వ అనంత‌పురం జిల్లాలో అయినా, విభ‌జ‌న త‌ర్వాతి అనంత‌పురం జిల్లాలో అయినా బీసీల జ‌నాభా గ‌ట్టిగా ఉంటుంది. అనంత‌పురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బోయ‌ల జ‌నాభా, హిందూపురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో…

పూర్వ అనంత‌పురం జిల్లాలో అయినా, విభ‌జ‌న త‌ర్వాతి అనంత‌పురం జిల్లాలో అయినా బీసీల జ‌నాభా గ‌ట్టిగా ఉంటుంది. అనంత‌పురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో బోయ‌ల జ‌నాభా, హిందూపురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో కురుబ‌ల జ‌నాభా ప్ర‌భావవంత‌మైన స్థాయిలో ఉంటుంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో వీరిని బాగా ఆక‌ర్షించ‌గ‌లిగారు. కాంగ్రెస్ రాజ‌కీయాల్లో రెడ్ల ఆధిప‌త్యం గ‌ట్టిగా ఉండ‌టంతో అప్పుడు రాజ‌కీయంగా బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు ఆక‌ర్షితుల‌య్యారు. ఆ ఆక‌ర్ష‌ణ ద‌శాబ్దాలు గ‌డిచినా అలాగే కొన‌సాగింది.

రాష్ట్రంలో అధికారం మార్పిడి అయితే చాలా సార్లు జ‌రిగినా.. బీసీల జ‌నాభా గ‌ట్టిగా ఉండే అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల్లో కాంగ్రెస్ ఆ త‌ర్వాత త‌న ఉనికిని చాటుకున్నా, క‌ర్నూలు జిల్లాలో అయితే… కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య‌మే సాగినా.. ఆ త‌ర్వాత ఆ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్ర‌మించినా.. బీసీలు తెలుగుదేశం వైపు అనే మాట అయితే ఒక ప్ర‌చారంలో ఉంచ‌గ‌లిగారు! కానీ ఆ ప‌రిస్థితి చాలా వ‌ర‌కూ మారిపోయింది ఇది వ‌ర‌కే!

2009 నుంచినే ఈ మార్పు అయితే మొద‌లైంది. 2009లోనే బీసీల నుంచి అప్ప‌టి వ‌ర‌కూ ల‌భించిన మ‌ద్ద‌తును టీడీపీ పొంద‌లేక‌పోయింది. 2014లో చంద్ర‌బాబు ఇచ్చిన అడ్డ‌మైన హామీల వ‌ల్ల టీడీపీ అనంత‌పురం జిల్లాలో 12 సీట్ల‌ను నెగ్గ‌గ‌లిగింది కానీ, బీసీల స‌పోర్ట్ తో అయితే కాదు! ఇక 2014 నాటికి ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడింది. మ‌రి 2024 ఎన్నిక‌లు టీడీపీకి చావోరేవో లాంటివి!

అనంత‌పురం వంటి చోట టీడీపీ లేవ‌క‌పోతే మాత్రం ఇక ఆ పార్టీకి భ‌విష్య‌త్తు లేన‌ట్టే! పూర్వ అనంత‌పురం జిల్లాను ఒక‌టిగా చూసినా, రెండుగా చూసినా.. టీడీపీ మాత్రం త‌నకు ఒక‌ప్పుడు సాలిడ్ గా స‌పోర్ట్ చేసిన సెక్టార్ లో ఆ మ‌ద్ద‌తును ఇప్పుడు పొందుతున్న ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు!

బీసీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌న ప‌ట్టును పెంచుకుంటూ ఉండ‌గా.. టీడీపీ దానిపై ఆశ‌లు పెట్టుకునే ప‌రిస్థితుల్లో కూడా లేకుండా పోతోంది. ఆఖ‌రికి అభ్య‌ర్థిత్వాల విష‌యంలో కూడా బీసీ క్యాండిడేట్ల‌ను గ‌ట్టిగా పెట్టుకునే స్థితిలో టీడీపీ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం!

అనంత‌పురం, హిందూపురం ఎంపీ సీట్ల నుంచి టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేస్తారంటే గ‌ట్టిగా ఇద్ద‌రు బీసీ అభ్యర్థుల పేర్లు చెప్ప‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అనంత‌పురం నుంచి పోటీ చేయ‌డానికి టీడీపీ క‌డ‌ప జిల్లా నుంచి అభ్య‌ర్థి ని  తెచ్చుకుంద‌ట‌! క‌డ‌ప జిల్లాకు చెందిన టీడీపీ నేత సుధాక‌ర్ యాద‌వ్ త‌న‌యుడిని తెచ్చి అనంత‌పురం ఎంపీ గా నిల‌బెడ‌తార‌ట‌! ఇది చాలు టీడీపీ ప‌రిస్థితిని చాటి చెప్ప‌డానికి!

బీసీల పార్టీ అంటూ అనంత‌పురం జిల్లాలో ద‌శాబ్దాలుగా రాజ‌కీయం చేసుకుంటున్న టీడీపీ ఆఖ‌రికి అనంత‌పురం వంటి చోట ఎంపీగా నిల‌బెట్ట‌డానికి స‌రైన బీసీ నేత లేక ప‌క్క జిల్లా నుంచి అరువు తెచ్చుకునే ప‌రిస్థితికి దిగ జారింది.

గ‌త మూడు ద‌శాబ్దాల్లో టీడీపీ త‌యారు చేసుకున్న బీసీ నేత‌లు ఇద్ద‌రే! అది కాలువ శ్రీనివాసులు, పార్థ‌సార‌ధి! వీళ్ల పేరుతోనే ఇన్నేళ్లు బీసీ రాజ‌కీయం చేశారు. అయితే వీళ్ల మొహాలే జ‌నాల‌కు మొత్తేశాయి. ఇప్ప‌టికీ వీళ్లే టీడీపీకి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం ఇన్ చార్జిలు. అయితే వీరిని పోటీ చేయిస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ప‌డ్డ ఓట్లు కూడా ప‌డే ప‌రిస్థితి లేదు. మార్పు చేయాలంటే.. మ‌రో బీసీ నేత పేరు వినిపించ‌దు!

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో రెండు శాతం ఓట్లు లేని క‌మ్మ వాళ్ల గుప్పిట్లో టీడీపీ ఉంది. వారి జ‌నాభా రెండు శాతానికి మించ‌క‌పోయినా.. నాలుగైదు అసెంబ్లీ సీట్ల‌లో క‌మ్మ వాళ్లే నేత‌లుగా ఉన్నారు! పేరుకు బీసీల పార్టీ, ఆధిప‌త్యం మాత్రం క‌మ్మ వాళ్ల‌ది! మ‌రి ఆ క‌మ్మ నేత‌లైనా పార్టీని ఉద్ధ‌రిస్తున్నారా.. అంటే, అధికారం ఉంటే అంతా తమ‌దే అంటారు. అధికారం లేక‌పోతే అడ్ర‌స్ ఉండ‌రు! ఈ ప‌రిస్థితులు ఈనాటివి ఏమీ కాదు. బీసీల్లో ప‌ట్టును టీడీపీ రాత్రికి రాత్రి కోల్పోలేదు. నెమ్మ‌ది నెమ్మ‌దిగా ఇది జ‌రిగింది. ఇప్పుడు చేతులు కాలుతున్నా క‌నీసం.. ఆకులు ప‌ట్టుకోలేని ప‌రిస్థితుల్లో ఉంది టీడీపీ.

టీడీపీ రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవాలంటే ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని 14 సీట్లలో కనీసం ప‌ది సీట్లు రావాలి! ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో నాలుగు సీట్ల‌లో మాత్ర‌మే టీడీపీ గ‌ట్టి పోటీ ఇచ్చే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎంపీ సీట్ల‌కు అయితే అభ్య‌ర్థులు ఎవ‌ర‌నే దిక్కు కూడా లేదు!