బీజేపీ త‌ర‌ఫున పోటీ.. న‌టీమ‌ణి నాలుగు అప్లికేష‌న్లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునే ఆశావ‌హుల నుంచి బీజేపీ అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌గ‌టున ప‌దుల కొద్దీ అప్లికేష‌న్లు వ‌చ్చిన‌ట్టుగా ఉన్నాయి. మ‌రి ఇప్ప‌టికే టీఆర్ఎస్…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునే ఆశావ‌హుల నుంచి బీజేపీ అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి స‌గ‌టున ప‌దుల కొద్దీ అప్లికేష‌న్లు వ‌చ్చిన‌ట్టుగా ఉన్నాయి. మ‌రి ఇప్ప‌టికే టీఆర్ఎస్ దాదాపు అన్ని స్థానాల‌కూ త‌న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేసింది. టీఆర్ఎస్ ను ఓడించి తామే అధికారంలోకి వ‌స్తామంటున్న బీజేపీ ఎప్ప‌టికి వ‌డ‌పోత‌ను పూర్తి చేసి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుందో చూడాల్సి ఉంది.

ఇక బీజేపీ త‌ర‌ఫున పోటీకి అప్లికేష‌న్లు పెట్టుకున్న వారిలో సినీన‌టి, నిర్మాత‌, ద‌ర్శ‌కురాలు జీవిత కూడా ఉన్నార‌ట‌! ఈమె కొన్నళ్ల నుంచి బీజేపీలో ఉన్నారు. ఇప్ప‌టికే జీవిత ప‌లు పార్టీలు మారారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీల్లో.. వివిధ సంద‌ర్భాల్లో ఈమె త‌న భ‌ర్త రాజ‌శేఖ‌ర్ తో క‌లిసి చేరారు. అయితే ఎక్క‌డా వీరికి రాజ‌కీయ ప్రాధాన్య‌త అయితే ల‌భించ‌లేదు. 

ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆమె తెలంగాణ రాజ‌కీయంలో యాక్టివేట్ అవుతానంటూ బీజేపీలో చేరారు. ఆ వెంట‌నే సెన్సార్ బోర్డు ప‌ద‌వేదో పొందిన‌ట్టుగా ఉన్నారు. మ‌రి ఇప్పుడు జీవిత ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతానంటున్నార‌ట‌! ఇందు కోసం ఆమె అప్లికేష‌న్ పెట్టుకున్నారు. 

ఒక‌టి కాదు ఏకంగా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల విష‌యంలో త‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చంటూ బీజేపీ నాయ‌క‌త్వానికి జీవిత అప్లికేష‌న్లు పెట్టుకున్నార‌ట‌. సికింద్రాబాద్, స‌న‌త‌న్ న‌గ‌ర్, జూబ్లీహిల్స్, కూక‌ట్ ప‌ల్లి.. ఇలా నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక‌దాని టికెట్ ను త‌న‌కు కేటాయించాలంటూ జీవిత బీజేపీ నాయ‌క‌త్వాన్ని కోరుతున్నార‌ట‌!

మ‌రి నాలుగు చోట్ల‌లో ఎక్క‌డైనా పోటీకి సిద్ధ‌మంటూ జీవిత పెట్టుకున్న అప్లికేష‌న్ల‌ను క‌మ‌లం పార్టీ ఎంత సీరియ‌స్ గా తీసుకుంటుందో చూడాల్సి ఉంది. క‌నీసం ఒక చోట అయినా ఈ న‌టీమ‌ణికి బీజేపీ అవ‌కాశం ఇస్తుందో లేదో!