ఎంత మిత్రపక్షం అయినా.. అవినీతి కేసులు అంటే మద్దతు పలకడానికి కాస్త సందేహిస్తాయి! ప్రత్యేకించి ఇప్పటి వరకూ తెలుగుదేశం- జనసేనలు పైకి చూపుతున్న పొత్తు ప్రకారం అయితే, చంద్రబాబు అరెస్టు అయ్యింది అవినీతి కేసులో కాబట్టి.. మద్దతు పలకడానికి పవన్ కల్యాణ్ కాస్త అయినా ఆలోచించాల్సింది! మరి లోపాయి కారీగా వీరి బంధం ఏమిటనేది పవన్ కల్యాణ్ బాహాటంగా రెచ్చిపోతున్న తీరును బట్టి అనుమానించాల్సి వస్తోంది!
ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పార్టనర్‌గా చూశారు తటస్తులు. అయితే ఆ పార్ట్ నర్ షిప్ కేవలం పవన్ కు జగన్ అంటే విపరీతమైన అక్కసు, ఆగ్రహాలు ఉండటం వల్లనే అని అనుకున్నారంతా! అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చంద్రబాబు నుంచి పవన్ కు ప్యాకేజీ అంటూ వచ్చింది. పవన్ ను ప్యాకేజీ స్టార్ గా అభివర్ణించింది.
ఇక చంద్రబాబు అరెస్టు అయిన సీన్లో పవన్ కల్యాణ్ యాగీ చేస్తున్న తీరు మాత్రం.. చంద్రబాబు అవినీతి బురదలో దొర్లుతుంటే ఆ బురద పవన్ కల్యాణ్ కూడా పోటీ పడి తనకు రాసుకుంటున్నట్టుగా ఉంది! ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ ఎక్కడా అధికారం లేడు. కాబట్టి.. చంద్రబాబు కేబినెట్ ముఖంగా అవినీతి చేసినట్టుగా రుజువైనా అందులో పవన్ కు మకిలి అంటదను కోవాలి! అయితే పవన్ కల్యాణ్ మాత్రం.. అవినీతి వ్యవహారంలో చంద్రబాబు పూర్తి మద్దతు అని ప్రకటించాడు!
అదేమంటే.. గతంలో తనకు చంద్రబాబు మద్దతు ప్రకటించాడని, కాబట్టే ఇప్పుడు మద్దతు అని అంటున్నాడు! ప్రజధానం లూటీ చేశారు, షెల్ కంపెనీలను సృష్టించి ప్రభుత్వ ధనాన్ని దారి మళ్లించారు, ఐపీసీలో 409 బలమైన సెక్షన్, ఇది తేలికగా పెట్టరు.. పెట్టారంటే బలమైన సాక్ష్యాధారాలు ఉన్నట్టే అంటూ లా తెలిసిన వాళ్లు చెబుతున్నారు! అయితే పవన్ కల్యాణ్ మాత్రం బేషరతు మద్దతును
ప్రకటించారు!
మరి ఈ ఉదంతంతో చంద్రబాబు నాయుడు వేరు, తను వేరు కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్టుగా అయ్యింది. గతంలో చంద్రబాబును అవినీతి పరుడు అంటూ పవన్ కల్యాణ్ చాలా సార్లు విమర్శించాడు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అయితే విరుచుకుపడ్డాడు. ఇక 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు పుత్రప్రేమ గురించి, అవినీతి గురించి పవన్ మాట్లాడాడు.
తను మద్దతు పలికింది అవినీతి చేసుకొమ్మని కాదంటూ వ్యాఖ్యానించాడు. ఇప్పుడేమో అదే అవినీతి కేసుల్లో చంద్రబాబు జైలుకు వెళితే పవన్ కలత చెందుతున్నాడు, నిరసనలు, బంద్ లు చేయిస్తున్నాడు! మరి పవన్ చూపుతున్న ఈ దత్తపుత్ర ప్రేమ దీర్ఘకాలంలో ఆయన రాజకీయ పతనానికి కూడా బాటలు వేస్తోందనడంలో ఆశ్చర్యం లేదు!