లోకేశ్ మ‌నుషుల‌కే టికెట్లు…బాబు స‌న్నిహితులకు పెండింగ్‌!

టీడీపీలో రెండు వ‌ర్గాలున్నాయి. ఒక‌టి నారా లోకేశ్‌, రెండోది చంద్ర‌బాబునాయుడు వ‌ర్గం. ఈ విమ‌ర్శ వ‌చ్చిన‌ప్పుడు… అబ్బే, అదేం లేదు, అంతా చంద్ర‌బాబునాయుడు వ‌ర్గ‌మే అని పైకి ఎన్ని చెబుతున్నా, వాస్త‌వం మ‌రోలా ఉంది.…

టీడీపీలో రెండు వ‌ర్గాలున్నాయి. ఒక‌టి నారా లోకేశ్‌, రెండోది చంద్ర‌బాబునాయుడు వ‌ర్గం. ఈ విమ‌ర్శ వ‌చ్చిన‌ప్పుడు… అబ్బే, అదేం లేదు, అంతా చంద్ర‌బాబునాయుడు వ‌ర్గ‌మే అని పైకి ఎన్ని చెబుతున్నా, వాస్త‌వం మ‌రోలా ఉంది. ప్ర‌స్తుతం నారా లోకేశ్ మ‌నుషులుగా ముద్ర‌ప‌డిన వారికే పెద్ద పీట‌. చంద్ర‌బాబు వైఖ‌రికి భిన్నంగా ఎన్నిక‌ల‌కు ఏడాదికి పైగా స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ, కొన్ని చోట్ల ఏకంగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.

అది కూడా పాద‌యాత్ర‌లో లోకేశ్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అభ్య‌ర్థుల‌ను ప‌రిచ‌యం చేస్తూ, గెలిపించాల‌ని అభ్య‌ర్థిస్తున్నారు. టీడీపీలో ఇదో కొత్త ఒర‌వ‌డిగా చెప్పుకోవ‌చ్చు. అయితే అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌పై టీడీపీ సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు. లోకేశ్ త‌నకంటూ ఓ టీమ్‌ను బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలో, బాగా కావాల్సిన వారికి అప్ప‌టిక‌ప్పుడే టికెట్ ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టిస్తున్నార‌నే చ‌ర్చ, ర‌చ్చ టీడీపీలో మొద‌లైంది.

ప్ర‌స్తుతం లోకేశ్ పాద‌యాత్ర చిత్తూరు జిల్లాలో సాగుతోంది. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కూ లోకేశ్ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. వీరిలో మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి కూడా ప‌ల‌మ‌నేరు టికెట్ ద‌క్కించుకున్న వారిలో ఉన్నారు. ఇటు చంద్ర‌బాబు, అటు లోకేశ్‌తో కూడా అమ‌ర్నాథ్‌రెడ్డి స‌న్నిహితంగా వుంటారు. కాబ‌ట్టి ఆయ‌న ఇద్ద‌రి మ‌నిషిగా గుర్తింపు పొందారు.

ఇక మిగిలిన వారి సంగ‌తి చూద్దాం. న‌గ‌రిలో దివంగ‌త మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు కుమారుడు గాలి భానుప్రకాశ్‌, శ్రీ‌కాళ‌హ‌స్తిలో దివంగ‌త మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు సుధీర్‌రెడ్డి, చంద్ర‌గిరిలో పులివ‌ర్తి నాని, స‌త్య వేడులో మాజీ ఎమ్మెల్యే హేమ‌ల‌త కుమార్తె డాక్ట‌ర్ హెలెన్ పేర్ల‌ను లోకేశ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. వీరి విజ‌యానికి కృషి చేయాల‌ని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. వీరంతా లోకేశ్ టీమ్ అని టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. నిజానికి బొజ్జ‌ల సుధీర్ శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో స‌రిగా తిర‌గ‌డం లేద‌ని, ఇలాగైతే టికెట్ క‌ష్ట‌మ‌ని ఆ మ‌ధ్య చంద్ర‌బాబు ఆయ‌న్ను హెచ్చ‌రించారు. అయినా లోకేశ్ ఇవేవీ ప‌ట్టించుకోలేదు.

తిరుప‌తిలో మాజీ ఎమ్మెల్యే సుగుణ‌మ్మ త‌న వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు కాక‌పోవ‌డంతోనే పెండింగ్‌లో పెట్టార‌నే చ‌ర్చ న‌డుస్తోంది. చిత్తూరులో అస‌లు పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వ‌మే లేదు. త‌న తండ్రి చంద్ర‌బాబుకు స‌న్నిహితులుగా ముద్ర‌ప‌డిన వాళ్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డానికి ఓ ప‌థ‌కం ప్ర‌కారం లోకేశ్ పావులు క‌దుపుతున్నార‌ని స‌మాచారం. ఉదాహ‌ర‌ణ‌కు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డిని తీసుకుందాం. నాలుగైదు సార్లు ఓడిపోయార‌నే ఉద్దేశంతో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్ట‌డానికి లోకేశ్ నిర్ణ‌యించుకున్నారు.

త‌న తండ్రి వెంట ఔట్‌డేటెడ్ లీడ‌ర్స్ వుండ‌డం వ‌ల్లే టీడీపీ బ‌ల‌హీన‌ప‌డింద‌నేది లోకేశ్ భావ‌న‌గా చెబుతున్నారు. టీడీపీని ప్ర‌క్షాళ‌న చేసే స‌త్తా త‌న‌కే ఉంద‌నేది ఆయ‌న ప్ర‌గాఢ విశ్వాసం. అందుకే పార్టీలో సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టే క్ర‌మంలో వృద్ధ నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని లోకేశ్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే యువ‌త‌కు అధిక సీట్లు క‌ట్ట‌బెట్ట‌డంతో పాటు వారిలో త‌న‌కు అనుకూల‌మైన వారినే ఎంపిక చేసుకుంటున్నారు.