బీజేపీ అంటే ఏపీ పాలక, ప్రతిపక్ష పార్టీలు వణికిపోతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ… గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుపై ఈ పార్టీలేవీ కిక్కురమనడం లేదు. వీళ్లలో వీరు తిట్టుకోవడం తప్పితే, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే దమ్ము, ధైర్యం లేవు. మార్చి ఒకటిన చమురు సంస్థలు గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇంటికి వినియోగించే సిలిండర్‌పై రూ.50, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్‌పై రూ.350.50 పెంచాయి. 8 నెలల తర్వాత సిలిండర్ల ధరలను పెంచడం గమనార్హం. సిలిండర్ల ధరలపై తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇదే ఏపీ విషయానికి వస్తే…. అసలు సిలిండర్ల ధరల పెరుగుదలే లేనట్టుగా వ్యవహారం కొనసాగుతోంది. గృహ వినియోగదారులపై భారం వేయడం ఏంటని నిలదీసే ఏ ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం ఆ రాష్ట్ర దౌర్భాగ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే తెలంగాణలో చూస్తే… మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల 3న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు అధికార పార్టీ బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. రాష్ట్రాల ఎన్నికలైన తర్వాత గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి ఆనవాయితీ అయ్యిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మహిళా దినోత్సవం (ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునే సంగతి తెలిసిందే) సందర్భంగా దేశ మహిళలకు ప్రధాని మోదీ ఇచ్చే కానుక ఇదేనా అని ఆయన నిలదీశారు. మోదీ ప్రభుత్వం రాకముందు రూ.400 ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1200కు చేరువలో ఉందని ధ్వజమెత్తారు. ఇంకా మహిళా మంత్రులు కూడా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఇలాంటి నిలదీతలు ఏపీలో కలలో అయినా చూడొచ్చా? అనేది ప్రశ్న. మోదీ సర్కార్ అంటే… ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలకు వెన్నులో వణుకు. తమను కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తారనే భయమే వారి నోటిని కట్టి పడేసింది. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ఎంత అన్యాయం చేసినా, చేస్తున్నా ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో మన నాయకులున్నారు. ఈ వైఖరే ఏపీ పాలిట శాపమైంది.