తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడును జ్యూడీషియల్ కస్టడీకి అవసరం లేదంటూ వాదించిన ఢిల్లీ లాయర్ లూథ్రా రోజువారీ ఫీజు ఏకంగా కోటిన్నర రూపాయలు అట! ఇక ఢిల్లీ నుంచి రావడానికి ప్రత్యేక విమానం, లాడ్జింగ్-బోర్డింగ్ ఖర్చులు అదనం! అయితే ఇదంతా తెలుగుదేశం పార్టీకి ఒక లెక్క కాకపోవచ్చు! చంద్రబాబు కోసం తొలి రోజే బరిలోకి దిగిన లాయర్ల సంఖ్య ముప్పై వరకూ ఉందట! వారిలో ఇద్దరిని మాత్రమే వాదనలకు న్యాయస్థానం అంగీకరించింది. ఇలా లాయర్ల కోసం ఏకంగా కోట్ల రూపాయలను తెలుగుదేశం పార్టీ మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిందనే వార్తలు వస్తున్నాయి!
మరి కోట్లు ఖర్చు చేయడం తెలుగుదేశం పార్టీకి చాలా చిన్న విషయం. ఈ ఎపిసోడ్లో ఇంకా పెద్ద పెద్ద లాయర్లు, ఉద్ధండులు రంగంలోకి దిగుతారో వేచి చూడాల్సి ఉంది! మరి ఇదంతా బాగానే ఉంది కానీ.. చంద్రబాబును సీఐడీ కస్టడీకి అవసరం లేదని వాదించిన లాయర్.. రెండు అంశాలనే ప్రధానంగా ప్రస్తావించాడట!
అందులో ఒకటి.. చంద్రబాబును అరెస్టు చేయడంలో సాంకేతిక అంశాలను సీఐడీ పట్టించుకోలేదని ఆయన వాదించారట. చంద్రబాబును అరెస్టు చేయడం గురించి ముందుగా గవర్నర్ కు సమాచారం ఇవ్వాల్సిందని ఆయన కోర్టుకు నివేదించాడట, అలాగే చంద్రబాబును అరెస్టు చేసిన 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు ప్రవేశ పెట్టలేదని అన్నారట! ఈ రెండు అంశాలను ఆధారంగా చేసుకునే లూథ్రా బల్లగుద్దారట! కాబట్టి చంద్రబాబుకు నోటీసులు ఇస్తే సరిపోతుందని, జ్యూడీషియల్ కస్టడీకి అవసరం లేదన్నారట!
అయితే.. ఈ మాత్రం వాదించడానికి కోటిన్నర రూపాయలు ఫీజు చెల్లించాలా అనే అనుమానం రాకమానదు! కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్న వారు కూడా ఇంతకన్నా మెరుగ్గా మాట్లాడగలరేమో! ఒకేఒక్కడు సినిమా క్లైమాక్స్ లో విలన్ క్యారెక్టర్ రఘువరన్ ఇలాగే వాదిస్తాడు! తనను అరెస్టు చేయించడానికి అర్జున్ క్యారెక్టర్ తన ఇంటి వద్దకు రాగా.. ఒక సీఎంను అరెస్టు చేయడం అంటే ఏమిటో తెలుసా? దానికి ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయో తెలుసా? సీఎంను అరెస్టు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ అవసరం అని కూడా తెలీయకుండానే ఇక్కడి వరకూ వచ్చావా? అంటూ ఏకబిగిన డైలాగులు చెబుతాడు!
నిజమే.. సీఎంను అరెస్టు చేయాలంటే గవర్నర్ పర్మిషన్ అవసరం, కానీ నువ్వు ఇప్పుడు మాజీ సీఎం అంటూ రఘువరన్ కు అర్జున్ గుర్తు చేస్తాడు! చంద్రబాబు విషయంలో కూడా ఇదే పాయింటే సీఐడీ తరఫు లాయర్లు గుర్తు చేశారు లూథ్రాకు!
చంద్రబాబు మాజీ సీఎం మాత్రమే అని, ఆయనను అరెస్టు చేయడానికి గవర్నర్ పర్మిషన్ అవసరం లేదని సీఎం కార్యాలాయానికి సమాచారం ఇస్తే చాలని, అరెస్టు చేసిన మూడు నెలల్లోగా గవర్నర్ కు సమాచారం ఇస్తే చాలని సీఐడీ తరఫు లాయర్ పొన్నవోలు వాదించినట్టుగా కథనాలు వస్తున్నాయి! మరి మాజీ సీఎంను అరెస్టు చేయాలంటే గవర్నర్ కు చెప్పాలని వాదించడానికి ఢిల్లీ నుంచి రావాల్నా!
ఇక రెండో అంశం.. చంద్రబాబును అరెస్టు చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచలేదనేది! చంద్రబాబు అరెస్టుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటి నుంచే సమయాన్ని లెక్కబెట్టాలంటూ ఆ ఢిల్లీ లాయరు వాదించాడట! రాత్రి 11 నుంచే సమయం లెక్కబెట్టాలటన్నాడట! మరి ఈ ముదురు తెలివి తేటలు చూపించడానికే ఇక్కడకు వచ్చినట్టుగా ఉన్నాడు లూథ్రా! ఈ వాదనలను కోర్టు పట్టించుకోలేదు.
చంద్రబాబు ఎలాంటి స్కామ్ కూ పాల్పడలేదంటూ వాదించాల్సింది పోయి, ఇలా సాంకేతిక కారణాలను చూపించే కస్టడీకి వద్దంటూ వాదించడాన్ని బట్టి.. ఈ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై సామాన్యుల్లో కూడా అనుమానాలు మరింత బలపడుతున్నాయి!