ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి విశాఖ ఇష్టం. ఆయన సీఎం గా విశాఖకు చాలా సార్లు వచ్చారు. అంతకు ముందు ప్రతిపక్ష నేతగా అనేక పర్యాయాలు విశాఖలో పర్యటించారు. కానీ ఏ రోజూ జగన్ విశాఖలో రాత్రి బస చేయలేదు. ఫస్ట్ టైమ్ గత ఏడాది నవంబర్ లో ప్రధాని మోడీతో పాటు విశాఖకు వచ్చిన జగన్ ఒక రాత్రి మాత్రం నిద్ర చేశారు.
ఇపుడు జగన్ మూడు రోజుల పాటు విశాఖలో గడపబోతున్నారు. ఇది కూడా మొదటిసారే. విశాఖలో జగన్ ఇన్ని రోజులు ఉన్నది ఎపుడూ లేదు. కానీ ఆ సందర్భం అలా వచ్చింది. విశాఖలో ఈ నెల 3, 4 తేదీలలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సు కోసం జగన్ విశాఖలో విడిది చేస్తున్నారు. ఒక రోజు ముందుగానే ఆయన విశాఖకు చేరుకుంటున్నారు.
వైసీపీ ప్రభుత్వం పెట్టుబడుల సదస్సుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమ ప్రభుత్వం మీద విపక్షాలు చేస్తున్న విమర్శలకు ఒకే ఒక్క సదస్సుతో తగిన సమాధానం చెప్పాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సుని విజయవంతం చేయడం కోసం ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.
ఈ సదస్సు సన్నాహక కార్యక్రమాలను తాను కూడా స్వయంగా చూసి తుది మెరుగులు దిద్దడంతో పాటు సదస్సు మీద ప్రభుత్వం పూర్తి అటెన్షన్ ఉందని చాటి చెప్పడం కోసం జగన్ ఈ నెల 2వ తేదీనే విశాఖకు చేరుకుంటున్నారు. వేయి కళ్ళతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వైపు చూస్తోంది.
విభజన ఏపీలో మొదటి సారి పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో పెట్టుబడుల సదస్సు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ దశ దిశను నిర్దేశించే సదస్సుగా దీన్ని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సదస్సు విజయవంతం కావాలని అంతా కోరుకుంటున్న వేళ జగన్ ముఖ్యమంత్రిగా కంటే ఏపీలోని అయిదు కోట్ల ప్రజానీకం తరఫున పెద్దగా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామిక దిగ్గజాలకు ఆహ్వానం పలికేందుకు వారిని సమాదరించి ఏపీవైపు వారంతా చూసేలా చేసేందుకు చేయాల్సిన ప్రయత్నమంతా చేస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.