సిటీ-యాక్సిస్ విలీనం.. కస్టమర్ల పరిస్థితేంటి?

ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన పలు సేవలు, యాక్సిస్ బ్యాంక్ వశమయ్యాయి. ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు, ఇన్సూరెన్స్ వ్యాపారాలు…

ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన పలు సేవలు, యాక్సిస్ బ్యాంక్ వశమయ్యాయి. ఇవాళ్టి నుంచి సిటీ బ్యాంక్ కు చెందిన హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు, ఇన్సూరెన్స్ వ్యాపారాలు యాక్సిస్ బ్యాంక్ కంట్రోల్ లోకి వచ్చాయి. గతేడాది మార్చిలో ఈ విలీనంపై ప్రకటన రాగా, ఇవాళ్టితో అది పూర్తయింది. దాదాపు 11,630 కోట్ల రూపాయల అతిపెద్ద ఫైనాన్షియల్ డీల్ ఇది. తాజా విలీనంతో ఐసీఐసీఐ, హెడ్ డీ ఎఫ్ సీ సంస్థలతో యాక్సిస్ మరింత పోటీ పడుతుంది.

సిటీ బ్యాంక్ కస్టమర్ల పరిస్థితేంటి?

ఏడాది కాలంగా జరిగిన ప్రాసెస్ లో రెండు సంస్థలూ కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదనే కోణంలోనే ఆలోచించాయి. ఎందుకంటే, గతంలో ఆంధ్రాబ్యాంక్ విలీనం జరిగినప్పుడు, ఎన్నో అనుమానాల మధ్య చాలామంది ఖాతాదారులు ఆంధ్రాబ్యాంక్ ఎకౌంట్లు వదులుకున్నారు. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు సిటీ-యాక్సెస్ అన్ని ఏర్పాట్లు చేశాయి

ప్రస్తుతం సిటీ బ్యాంక్ వినియోగదారులు ఏ కార్డులు వినియోగిస్తున్నారో అవన్నీ చెల్లుబాటు అవుతాయి. వాళ్లు యథాతథంగా ఆ కార్డుల్ని వాడుకోవచ్చు. అంతేకాదు, సిటీ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు, యాప్ సేవలు కూడా కొనసాగుతాయి. అటు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, సిటీ ఏటీఎంల వాడకంలో కూడా ఎలాంటి ఇబ్బందులు, కండిషన్లు లేవు.

అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఖాతాదారులంతా మరోసారి తమ కేవైసీని పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా గందరగోళం తలెత్తకుండా వ్యవహరిస్తోంది యాక్సిస్ బ్యాంక్. దశలవారీగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించింది. పైగా ఇప్పటికప్పుడు ఈ తతంగాన్ని మొదలుపెట్టకూడదని కూడా నిర్ణయించింది.

ఇటు సిటీ బ్యాంక్, అటు యాక్సిస్ బ్యాంక్ రెండూ తమ ఖాతాదారులకు ఈ అంశాలపై స్పష్టతనిస్తూ ఎస్సెమ్మెస్ లు, ఈ-మెయిల్స్ పంపించింది. మరింత సమాచారం, అనుమానాల నివృత్తి కోసం ఎక్కువగా అడిగే ప్రశ్నలు-సమాధానాలతో ఓ వెబ్ పేజీని కూడా ఏర్పాటుచేశాయి ఈ రెండు కంపెనీలు.

ఆర్బీఐ నివేదిక ప్రకారం, దేశంలో 25 లక్షల మంది సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు 3వేల కోట్ల రూపాయల లావాదేవీలు చేస్తున్నారు. వీళ్లెవరికీ ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా యాక్సిస్ బ్యాంక్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.