సాంకేతిక లోపాలతో ఇంటర్నెట్ ఆగిపోవడం సహజం, కానీ ప్రభుత్వాలకు కోపం వస్తే ఇంటర్నెట్ ఆగిపోవడం మాత్రం ఇండియాలోనే చూస్తుంటాం. అవును, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ షట్ డౌన్ జరిగిన సందర్భాలు అత్యథికంగా భారత్ లో ఉండటం గమనార్హం. గతేడాది ఏకంగా 84 సార్లు భారత్ లో ఇంటర్నెట్ పై ఆంక్షలు పెట్టింది ప్రభుత్వం. 2022లోనే కాదు, అంతకు ముందు ఐదేళ్ల రికార్డులు చూసినా కూడా ప్రపంచంలోనే ఇంటర్నెట్ పై ఆంక్షలు పెట్టే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది.
2022లో ప్రపంచవ్యాప్తంగా 187సార్లు ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. అందులో 84 ఘటనలు భారత్ లోనే జరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో అత్యథికంగా 49 సార్లు ఇంటర్నెట్ పై నిషేధం విధించడం గమనార్హం. 2019 ఆగస్ట్ లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన అనంతరం అక్కడ అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు, సోషల్ మీడియా ద్వారా ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ షట్ డౌన్ పాటించింది కేంద్ర ప్రభుత్వం.
ఆ తర్వాత ఎక్కడ ఏ చిన్న అలికిడి వినిపించినా అక్కడ ఇంటర్నెట్ సేవలు కట్ చేయడం సర్వ సాధారణం అయిపోయింది. గతేడాది భారత్ తర్వాత అత్యథికంగా ఇంటర్నెట్ పై ఆంక్షలు పెట్టిన రెండో దేశం ఉక్రెయిన్ కావడం విశేషం. ఉక్రెయిన్ లో 2022లో 22సార్లు ఇంటర్నెట్ ని నిషేధించారు. యుద్ధభీతితో ఉన్న ఉక్రెయిన్ లాంటి దేశాల్లో కూడా ఇంటర్నెట్ పై నిషేధం మనకంటే తక్కువగానే ఉందన్నమాట.
చీటికీ మాటికీ అల్లర్లు జరిగే దేశాలు, మత కలహాలు చెలరేగే దేశాలు, దాడులు, ప్రతి దాడులతో భయపడే దేశాలు, బాంబుల మోతలతో దద్దరిల్లిపోయే దేశాలు కూడా ఇంటర్నెట్ పై ఆంక్షలు పెట్టలేదు. సోషల్ మీడియా ద్వారా సమాచార మార్పిడిపై కత్తి కట్టలేదు. కానీ భారత్ లోని మోదీ ప్రభుత్వం మాత్రం ప్రజలు ఏం తెలుసుకోవాలి, ఎంత తెలుసుకోవాలి అని కొలతలు వేస్తోంది. అనుమానం వస్తే చాలు ఇంటర్నెట్ పై ఆంక్షలు పెడుతోంది.
కాశ్మీరే కాదు, తమకి అనుకూలంగా లేని ఏ ప్రాంతంలో అయినా ఇంటర్నెట్ షట్ డౌన్ చేయడానికి కేంద్రం వెనకాడ్డంలేదు. అందుకే ఐదేళ్లుగా ఆ రికార్డ్ భారత్ పేరిట చెక్కు చెదరకుండా కొనసాగుతూనే ఉంది.