తిరుమల కొండపై ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా అమలులోకి తెచ్చారు. దర్శనంతో పాటు, లడ్డు కౌంటర్, గదుల కేటాయింపులో కూడా దీన్ని వినియోగిస్తున్నారు. దళారీల బెడద తప్పుతుందని, అక్రమాలు తగ్గిపోతాయని టీటీడీ అధికారులు చెబుతున్నా.. దీని అమలులో అనేక కష్టనష్టాలు ఎదురయ్యేలా ఉన్నాయి.
దర్శనాల సమయంలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా టోకెన్ తీసుకున్న వారిని, క్యూలైన్లోకి వెళ్లే సమయంలో కూడా అదే టెక్నాలజీ ద్వారా పరీక్షించి అనుమతిస్తారు. అంటే ఇక్కడ ఒకరి బదులు మరొకరు టోకెన్ ద్వారా క్యూలైన్లోకి ప్రవేశించడం కుదరదన్నమాట. గదుల కేటాయింపు సమయంలో ఇప్పటివరకూ టోకెన్ తీసుకునేవారు, కాషన్ డిపాజిట్ కోసం తిరిగి వచ్చేవారు ఒకరే కావాల్సిన పని లేదు. కానీ ఇకపై గదుల కేటాయింపు సమయంలో ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఫొటో తీయించుకున్నవారే కాషన్ డిపాజిట్ కోసం తిరిగి రావాల్సి ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో వేరేవాళ్లు టోకెన్ తీసుకొచ్చినా కూడా డబ్బులివ్వలేని పరిస్థితి.
లడ్డూ కౌంటర్ల వద్ద కూడా ఇలాంటి సమస్యలే తలెత్తే అవకాశం ఉంది. గతంలో కేవలం టికెట్లు చూపించి లడ్డూలు తీసుకునే అకాశముంది, ఇప్పుడు దర్శనం చేసుకున్నవారే క్యూలైన్లోకి వెళ్లి లడ్డూలు తీసుకోవాలి. ముందు ఎవరి ఫొటో స్కాన్ చేశారో, వాళ్లే లడ్డూలకు కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి.
నెలలో ఒకసారే దర్శనమా..?
ఇక ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా దర్శనాలు మొదలయ్యాయి కాబట్టి, సర్వ దర్శనానికి వచ్చేవారికి నెలలో ఒకసారే ఆ అవకాశం ఉంటుందని అంటున్నారు. సర్వదర్శనాల పేరుతో కొండపైనే ఉండి రోజూ స్వామి వారి దర్శనం చేసుకోవాలంటే ఇకపై కుదరకపోవచ్చు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి దర్శనానికి రావాలంటే ఆర్జిత సేవలు లేదా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ ద్వారానే అది సాధ్యమవుతుంది. ఉచిత దర్శనం నెలలో ఒకసారేనంటూ ఇప్పటికే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి, విమర్శలు కూడా మొదలయ్యాయి. దీనిపై టీటీడీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఫేస్ రికగ్నిషన్ యాప్ ని టీటీడీ విజిలెన్స్ విభాగానికి, పోలీస్ విభాగానికి అనుసంధానం చేయడం ద్వారా దళారుల అక్రమాలను అత్యంత సులభంగా గుర్తించే వెసులుబాటు ఉంటుందని, అనుమానితుల కదలికల్ని కూడా అంచనా వేయొచ్చని అధికారులు భావించారు. కానీ ఆచరణలో సామాన్య భక్తజనం ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతానికి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నా, పూర్తి స్థాయిలో ఇది భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందో లేదో చూడాలి. ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఉపయోగాలు లేకపోయినా పర్లేదు, కొత్త సమస్యలు రాకుండా ఉంటే అంతే చాలు.