మార్చి నెల బాక్సాఫీస్.. మెరిసే ఛాన్స్ ఎవరికి?

గతేడాది మార్చి నెలలో భారీ సందడి కనిపించింది. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ మూవీతో పాటు, ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి నెల్లోనే థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ ఏడాది మార్చిలో మాత్రం అంత సందడి…

గతేడాది మార్చి నెలలో భారీ సందడి కనిపించింది. ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ మూవీతో పాటు, ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి నెల్లోనే థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ ఏడాది మార్చిలో మాత్రం అంత సందడి కనిపించడం లేదు. నెల మొత్తం మీద చూసుకుంటే అంచనాలతో వస్తున్న సినిమా ఒక్కటంటే ఒక్కటి మాత్రమే కనిపిస్తోంది

మొదటి వారంలో, అంటే మరో రెండు రోజుల్లో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, బలగం, ఇన్ కార్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి డైరక్ట్ చేసిన సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు. ఎప్పట్లానే ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వ విభాగాల్ని కృష్ణారెడ్డి చూసుకున్నారు. వీటితోపాటు ఈసారి డైలాగ్స్ కూడా ఈయనే రాశారు. రాజేంద్రప్రసాద్, మీనాతో మొదలుపెడితే సునీల్, సప్తగిరి, ప్రవీణ్, సోహైల్, అజయ్ ఘోష్.. ఇలా చాలామంది ఇందులో నటించారు.

ఈ సినిమాతో పాటు బలగం, ఇన్ కార్ అనే సినిమాలు వస్తున్నాయి. దిల్ రాజు కొత్తగా మరో బ్యానర్ పెట్టి, తన కూతుర్ని నిర్మాతగా పరిచయం చేస్తూ తీసిన సినిమా బలగం. కమెడియన్ వేణు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ప్రియదర్శి, కావ్యా కల్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దగ్గరుండి భారీగా ప్రచారం కల్పిస్తున్నాడు దిల్ రాజు. ఇక రితికా సింగ్ లీడ్ రోల్ పోషించిన ఇన్-కార్ సినిమా ఓ సామాజిక సందేశంతో తెరకెక్కింది.

రెండో వారంలో ఆది సాయికుమార్ నటించిన సీఎస్ఐ సనాతన్ రిలీజ్ అవుతోంది. ఇదొక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. రెండో వారంలో మిస్టర్ కల్యాణ్ అనే మరో చిన్న సినిమా వస్తోంది. ఇక బెల్లంకొండ గణేశ్ నటించిన నేను స్టూడెంట్ సర్ సినిమా కూడా మార్చిలోనే రిలీజ్ అవుతుంది. నాంది లాంటి హిట్ సినిమాను తీసిన సతీష్ వర్మ, నేను స్టూడెంట్ సర్ సినిమాకు నిర్మాత. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దాసాని హీరోయిన్ గా నటించింది. 

మూడో వారంలో ఉపేంద్ర నటించిన కబ్జా సినిమా విడుదలకు సిద్ధమైంది. చంద్రు డైరక్ట్ చేసిన ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. శ్రియ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించాడు.

ఇక ఇదే వారం నాగశౌర్య హీరోగా నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా వస్తోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో చాలా ఏళ్ల కిందటే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. అమెరికా షెడ్యూల్ లేట్ అవ్వడంతో విడుదలలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఈనెల 17న సినిమా రిలీజ్ అవుతోంది. నాగశౌర్య-అవసరాలది హిట్ కాంబినేషన్.

నాని హీరోగా నటించిన దసరా సినిమా మార్చి నెలాఖరుకు రిలీజ్ అవుతోంది. ఈ నెలలో భారీ అంచనాలతో వస్తున్న ఏకైక సినిమా ఇదే. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాపై నాని భారీ అంచనాలు పెట్టుకున్నాడు.

ఈ సినిమాతో పాటు భూతద్దం భాస్కరనారాయణ ఈనెల చివర్లో థియేటర్లలోకి వస్తోంది. ఇక విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ, కార్తికేయ హీరోగా చేసిన బెదురులంక సినిమాలు కూడా ఈ నెల్లోనే థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. వీటిలో ఏ సినిమా మెరుస్తుందో చూడాలి.