85 వేల ఎక‌రాల త్యాగానికి విలువ లేదా?

రాజ‌ధాని నిర్మాణానికి రైతులు 33 వేలు ఎక‌రాలు ఇచ్చార‌ని, మ‌రి శ్రీ‌శైలం ప్రాజెక్టుకు 85 వేల ఎక‌రాలు ఇచ్చిన రైతుల త్యాగానికి విలువ లేదా? ఇది రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు, మేధావుల నుంచి బాణంలా దూసుకొస్తున్న…

రాజ‌ధాని నిర్మాణానికి రైతులు 33 వేలు ఎక‌రాలు ఇచ్చార‌ని, మ‌రి శ్రీ‌శైలం ప్రాజెక్టుకు 85 వేల ఎక‌రాలు ఇచ్చిన రైతుల త్యాగానికి విలువ లేదా? ఇది రాయ‌ల‌సీమ ఉద్య‌మ‌కారులు, మేధావుల నుంచి బాణంలా దూసుకొస్తున్న ప్ర‌శ్న‌. వేలాది ఎక‌రాల భూములిచ్చి బ‌హుళార్థ‌సాధ‌క ప్రాజెక్టు నిర్మాణానికి కార‌కుల‌య్యారు.  ఆ ప్రాజెక్టులోని నీళ్ల‌పై భూములిచ్చిన రైతుల‌కు హ‌క్కు లేదంటే… ప్ర‌పంచంలో ఎనిమిదో వింత అనిపించ‌వ‌చ్చు. కానీ ఇది ప‌చ్చి నిజం. ఇది ప‌చ్చి ద‌గా.

రాజ‌ధాని రైతుల గురించి గ‌గ్గోలు పెడుతున్న రాజ‌కీయ పార్టీల నేత‌లు, ప్ర‌జాసంఘాలు, వామ‌ప‌క్షాలు, మీడియాకు శ్రీ‌శైలం ప్రాజెక్టుకు 85 వేల ఎక‌రాల‌ను త్యాగం చేసిన రైతుల గురించి ఎప్పుడైనా ప్ర‌శ్నించాల‌ని,  పాల‌కుల‌తో పోట్లాడాల‌నిపించిందా? వీటిలో ఏ ఒక్క‌టీ అనిపించి ఉండ‌వు…ఎందుకంటే రాయ‌ల‌సీమంటే ఓ శాపగ్ర‌స్త ప్రాంతం కాబ‌ట్టి. శ్రీ‌శైలం ప్రాజెక్టు నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లింపు తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. ఎప్పుడో 1963లో నాటి ప్ర‌ధాని నెహ్రూ శంకుస్థాప‌న చేసిన ప్రాజెక్టుకు సంబంధించి ఇప్ప‌టికీ న‌ష్ట‌ప‌రిహారం విష‌య‌మై న్యాయ‌స్థానాల చుట్టూ నిర్వాసిత‌ రైతులు, వారి పిల్ల‌లు తిరుగుతున్నారనే నిజం కాని నిజం.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ కోసం రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే నిర్ణ‌యం తీవ్ర సంచ‌ల‌నం రేకెత్తించింది. 2014లో నాటి సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ఖ‌రారు చేశారు. రాజ‌ధాని నిర్మాణానికి 29 గ్రామాల‌కు చెందిన  రైతుల నుంచి 33 వేల ఎక‌రాల‌ను సేక‌రించారు. అలాగే ప్ర‌భుత్వ , డికేటీ త‌దిత‌ర మ‌రో 20 వేల ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం సేక‌రించింది.

ఇప్పుడు అమ‌రావ‌తిలో అసెంబ్లీ భ‌వ‌నం మాత్రమే ఉంటుంద‌ని, విశాఖ‌లో స‌చివాల‌యం, క‌ర్నూల్‌లో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ ముంద‌డుగు వేసింది. రాజ‌ధానిపై అధ్య‌య‌నం చేసిన జీఎన్ రావు క‌మిటీ నివేదిక‌పై ఈ నెల 27న కేబినెట్ భేటీలో తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌ధాని రైతులు వారం నుంచి ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తు న్నారు. ఇక్క‌డి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌వ‌ద్ద‌ని, చంద్ర‌బాబును న‌మ్మి భూములిచ్చామ‌ని, ఇప్పుడు ఆ భూముల‌కు ధ‌ర‌లుండ‌వ‌ని గ‌గ్గోలు పెడుతున్నారు.

అమ‌రావ‌తి భూమ‌ల‌కు అధిక ధ‌రలు సీమ పుణ్య‌మే

ఒకే రాష్ట్రం, ఒకే భూమి. కానీ భూముల ధ‌ర‌ల్లో కోస్తా భూముల‌కు, మిగిలిన ప్రాంతాల భూముల‌కు ఎందుకంత వ్య‌త్యాసం. మా భూముల్లో మూడు పంట‌లు పండుతాయ‌ని, మాగాణి భూముల‌ని గొప్ప‌లు చెప్పుకునే వారు అస‌లా భూముల్లో పంట‌ల సాగుకు ఎక్క‌డి నుంచి నీళ్లు వ‌స్తున్నాయో తెలుసా?  ఆ భూముల‌కు శ్రీ‌శైలం ప్రాజెక్టు నుంచి సాగునీళ్లు వ‌స్తుండ‌డం వ‌ల్లే  మూడు పంట‌లు పండుతున్నాయి. అందువ‌ల్లే ఆ భూముల‌కు మిగిలిన ప్రాంతాల కంటే అధిక ధ‌ర‌లు.  

ఐదు ద‌శాబ్దాల నీళ్ల దోపిడీకి వెల‌క‌ట్ట‌గ‌ల‌మా?

ఒక‌టి కాదు రెండు కాదు…ఏకంగా ఐదారు ద‌శాబ్దాల నీళ్ల దోపిడీ. శ్రీ‌శైలం ప్రాజెక్టు ఉన్న రాయ‌ల‌సీమ‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ క‌ర‌వు ప్రాంతాల‌కు మాత్రం చుక్క‌నీళ్లు కూడా ద‌క్క‌వు. కానీ వంద‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కృష్ణా జిల్లాతో పాటు గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లోని రైతుల‌కు కృష్ణా నీళ్లు ఆ ప్రాజెక్టు నుంచి వెళుతాయి. దీంతో సంతృప్తిగా పంట‌లు పండించుకొని సంప‌ద‌ను సృష్టించుకుంటుంటే, మ‌రోవైపు క‌ర‌వుతో అల్లాడుతూ వ్య‌వ‌సాయంపై అప్పులే త‌ప్ప రాబ‌డి లేని బ‌క్క రైతులు ఆత్మ‌హ‌త్య‌లే ప‌రిష్కార మార్గంగా ఎంచుకున్న ద‌య‌నీయ స్థితి. ఇక ప్ర‌తినిత్యం చ‌స్తూ బ‌తుకుతున్న వారి మ‌నోవేద‌న గురించి మాటల్లో చెప్ప‌లేం. క‌ర‌వు ప్రాంత రైతాంగ ఆవేద‌న‌కు, ఆక్రోశానికి ఏ పేరు పెడ‌దామో విజ్ఞులు చెప్పాల్సిన స‌మ‌య‌మిది.

రాజ‌ధానికి స్వ‌చ్ఛందంగా భూములివ్వ‌డం అంటే ఇదేనా?

రాజ‌ధాని రైతుల‌కు అభివృద్ధి చేసిన భూమిలో ఎక‌రాకు 33 సెంట్లు చొప్పున ఇవ్వ‌డంతో పాటు ప్ర‌తి ఏటా ఎక‌రాకు రూ.50 వేలతో పాటు ప్ర‌తి ఏటా రూ.5 వేలు చొప్పున పెంచేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.  ప్లాట్ల కేటాయింపుతో సంబంధం లేకుండా ప‌దేళ్ల‌పాటు ఆ మొత్తం సొమ్ము చెల్లిస్తారు. రాష్ట్ర‌మంతా రూ.50 వేల‌ను రైతుల‌కు అది కూడా విడ‌త‌ల వారీగా మాఫీ చెల్లిస్తున్నారు. కానీ రాజ‌ధాని రైతుల‌కు ఒకేసారి రూ.1.50 ల‌క్ష‌లు చొప్పున ల‌బ్ధిని ప్ర‌భుత్వం క‌లిగిస్తోంది. ఇదేనా రాజ‌ధాని నిర్మాణానికి రైతులు స్వ‌చ్ఛందంగా భూములు ఇవ్వ‌డం అంటే అని రాయ‌ల‌సీమ, ఉత్తరాంధ్ర‌ ఉద్య‌మ‌కారులు, మేధా వులు ప్ర‌శ్న‌స్తున్నారు.

శ్రీ‌శైలం ప్రాజెక్టు కోసం వంద‌లాది గ్రామాల మున‌క‌

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు క‌ర్నూలు, మ‌హ‌బూబ్‌నగ‌ర్ జిల్లాల‌కు చెందిన రైతులు 85 వేల ఎక‌రాలు ఇచ్చార‌ని, భూములిచ్చిన వారిలో చాలా మందికి ఇప్ప‌టికీ న‌ష్ట‌ప‌రిహారం అంద‌లేద‌ని, త‌మ‌ది త్యాగం కాదా అని వారు ప్ర‌శ్నిస్తున్నారు.  100 గ్రామాలు, 17 శివారు ప‌ల్లెలు ఖాళీ చేసి శ్రీ‌శైలం ప్రాజెక్టు కోసం 85 వేల ఎకరాలు ఇచ్చిన‌ రైతులు, క‌నీసం ఆ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకునే హ‌క్కు కూడా వ‌దులుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.  శ్రీ‌శైలం ప్రాజెక్టులో మునిగిపోయింది గ్రామాలు మాత్ర‌మే కాదు…ప్ర‌జ‌ల జీవితాల‌నే విష‌యాన్ని గుర్తించాలి.

రాజ‌ధాని పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం

 అమ‌రావ‌తి రాజ‌ధానిపై ప‌క్కా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేశార‌ని రాయ‌ల‌సీమ మేధావులు, ఉద్య‌మ‌కారులు మండిప‌డు తున్నారు. ఇప్పుడు త‌మ భూముల‌కు కాస్తా ధ‌ర త‌క్కువ అవుతుంద‌నే ఆందోళనే త‌ప్ప రైతులు న‌ష్ట‌పోయిందేమీ లేద‌ని వాదిస్తున్నారు. ఏం మిగిలిన ప్రాంతాల్లో రైతులు లేరా? వారి భూముల‌కు ధ‌ర‌లు రావాల్సిన అవ‌స‌రం లేదా అని ప్ర‌శ్నిస్తున్నారు.

చ‌ట్ట‌రీత్యా మోసం

1982లో శ్రీ‌శైలం ప్రాజెక్టుకు సంబందించి ఓ సంస్థ అధ్య‌య‌నం చేసి చేదు నిజాల‌ను వెల్ల‌డించింది. ఆ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర 27,871 నిర్వాసితుల కుటుంబాల‌కు సంబంధించిన పున‌రావాస ప‌థ‌కం ఏదీ లేదు. ఎవ‌రో కొద్ది మంది త‌ప్పితే , అత్య‌ధిక భాగం నిర్వాసిత ప్ర‌జ‌ల‌కు భూసేక‌ర‌ణ చ‌ట్టం గురించి ఏమీ తెలియ‌దు. నిర్వాసిత ప్ర‌జ‌లు “చ‌ట్ట‌రీత్యా” మోసం చేయ‌బ‌డ్డారు.

సిద్ధేశ్వ‌రం అలుగు ఉద్య‌మం కనిపించ‌లేదా?

29 గ్రామాల రాజ‌ధాని రైతుల ఆందోళ‌న గురించి గోరింత‌లు కొండంత‌లు చేసి చూపిస్తున్న ఎల్లో మీడియాకు ఓ సూటి ప్ర‌శ్న‌. మూడేళ్ల క్రితం క‌ర్నూలు జిల్లాలో సిద్ధేశ్వ‌రం అలుగు ప్రాజెక్టు చేప‌ట్టాల‌ని రాయ‌ల‌సీమ పేద రైతాంగం పెద్ద ఎత్తున స్వ‌చ్ఛందంగా ఉద్య‌మించింది. సుమారు 25 వేల మంది రైతులు, విద్యార్థులు, మ‌హిళ‌లు పాల్గొన్న ఆ ఉద్య‌మాన్ని ప్ర‌జ‌ల‌కు చూప‌డానికి మీడియా క‌ళ్ల‌కు పొర అడ్డొచ్చిందా? ప‌త్రిక‌ల్లో రాయ‌డానికి సిరా అయిపోయిందా?  నాడు త‌మ ఆరాధ్య పాల‌కుడు చంద్ర‌బాబు ఉండ‌డం వ‌ల్ల ఉద్య‌మాల అణ‌చివేత‌లో మీడియా కూడా అప్ర‌క‌టిత పాత్ర పోషించింద‌నేది ప‌చ్చి నిజం. ఇప్పుడు త‌మ‌కు న‌చ్చ‌ని పాల‌కుడు సీఎం పీఠంపై ఉండ‌డం వ‌ల్ల లేనిది ఉన్న‌ట్టు, ఉన్న‌ది లేన‌ట్టు…అంతా క‌నిక‌ట్టు చేస్తుండడాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నారు. పాల‌కుల‌పై కోపంతో వెనుక‌బ‌డిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌పై విషం చిమ్మ వ‌ద్ద‌ని  రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జాసంఘాలు, వామ‌ప‌క్షాలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియా యాజ‌మాన్యాల‌ను ఆ ప్రాంత ప్ర‌జ‌లు వేడుకుంటున్నారు.

                                                                                                                                                -సొదుం ర‌మ‌ణారెడ్డి