శేఖర్ గుప్తా… పెద్ద జర్నలిస్టు. సీనియర్ జర్నలిస్టు. తన సర్వీసులో ఎంతోమందిని చూసి ఉంటారు. ఎన్నో సంఘటనలు చూసి ఉంటారు. ఎంతో మందిని కలిసి, మాట్లాడి ఉంటారు. అనుభవజ్ఞులు. నిన్న ఈయన ఇంగ్లీష్ లో మాట్లాడిన వీడియో చూశా.. పెద్దాయనతో మనకెందుకులే అనుకున్నా .. అయినా అది ఇంగ్లీషు రాని మాతృభాషోద్ధారకుల వరకూ చేరదులే అనుకున్నా. పొద్దుటే చూస్తే మాతృభాషోద్ధరణకు, మాతృజాతోద్ధరణకు నడుం బిగించి (తమ పిల్లలకు పోటీగా పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో అయినా సరే ఇంగ్లీష్ చదివితే మాతృభాష సచ్చిపోతుందని నమ్మించేందుకు) పేజీలు నింపుతున్న పత్రికలు ఈయన ఆంగ్ల ప్రసంగాన్ని అర్జంటుగా అనువాదం చేసి అత్యంత ప్రముఖంగా ప్రచురించాక నేను కూడా స్పందించకపోతే ఎలాగ అనిపించింది.
అయినా లోటు బడ్జెట్టుతో, రాజధాని లేకుండా రాష్ట్రము విడగొట్టబడినప్పుడు శేఖర్ గుప్తా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల తరపున మాట్లాడారా? లోటు బడ్జెట్టు పూడకుండానే ప్రభుత్వం కోట్లల్లో అప్పులు చేస్తుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఇంత ప్రేమ ఉన్న శేఖర్ గుప్తా మాట్లాడారా? విభజ సందర్భంగా ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకపొతే, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వకపొతే, దుగరాజపట్నం పోర్టు ప్రస్తావన లేకుండాపోతే శేఖర్ గుప్తా ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఆయన మాట్లాడింది, ఈ మీడియా పతాక శీర్షికల్లో వేసింది, రాష్ట్రం కోసమా? రాజకీయం కోసమా?
దూరపు కొండలు నునుపు అన్నట్టు ఎక్కడో ఢిల్లీ లో కూర్చుంటే అమరావతిలో కొండలన్నీ నున్నగానే కనిపిస్తాయి. అసలు కొండలు ఉన్నాయని కూడా కనిపించకపోవచ్చు. మూడేళ్ళ క్రితం ముంబాయి నుండి బెంగుళూరు నుండి కొందరు మిత్రులు అడిగేవారు. “అమరావతి నగర నిర్మాణం అయిపోయిందంటకదా?” అనే ప్రశ్న ఎన్నిసార్లు ఈ సుదూర ప్రాంతాల మిత్రులు అడిగారో చెప్పలేను. ప్రచారం అంత పెద్ద స్థాయిలో జరిగింది. దూరంగా ఉన్నవాళ్ళు విషయాలు తెలుసుకోడానికి మీడియాపైనే ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి, మీడియా ఎక్కువ భాగం “అమరావతి” నగరంపై అంతర్జాతీయ స్థాయి కలలు చూపించింది. అందువల్ల శేఖర్ గుప్తా లాంటి వాళ్ళు నమ్మేసి ఉండొచ్చు. కానీ అమరావతి (తాడికొండ, మంగళగిరి) ప్రజలు నమ్మలేదు. వాళ్ళకు అక్కడేం జరిగిందో తెలియదా? ఈ ప్రజల నిర్ణయానికంటే సుదూర తీరాన ఉండి మీడియాలో వార్తలు చూసి, కంప్యూటర్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూసి, డిజిటల్ డిజైన్లు చూసి చేసే విశ్లేషణ గొప్పదా?
చండీఘడ్ అంత గొప్ప నగరం మన అమరావతి అని శేఖర్ గుప్తా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. చండీఘడ్ నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మాజీ ఐఏఎస్ అధికారి ఎం జి దేవసహాయం అమరావతి గురించి ఏం చెప్పారో శేఖర్ గుప్తా దృష్టికి వెళ్ళకపోవడం దురదృష్టకరమా? లేక రాజకీయమా? దేవసహాయం అనేక సందర్భాల్లో అమరావతి గ్రామాల్లో పర్యటించి ఈ ప్రాంతం రాజధానికి అనుకూలం కాదనీ, పైగా బహుళ పంటలు పండే పొలాలను ధ్వంసం చెయ్యవద్దని చెప్పిన విషయం శేఖర్ గుప్తా ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు అమరావతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ఈ మీడియా సంస్థలు దేవసహాయం చెప్పిన విషయాలు పతాక శీర్షికలో అప్పుడు ఎందుకు ప్రచురించలేదు? రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసమా? రాజకీయం కోసమా?
నర్మదా బచావో ఆందోళన్ అధినేత్రి, ప్రముఖ సామజిక కార్యకర్త మేధా పాట్కర్ ఈ గ్రామాల్లో పర్యటించి ఇన్ని లక్షల మంది పేదప్రజల జీవనోపాధిని దెబ్బతీసే చర్యలు వద్దని, వ్యవసాయం ధ్వంసం చేయవద్దని వేడుకున్నప్పుడు ఈ మీడియా ఆ వార్తలను ఇంత ప్రముఖంగా ఎందుకు ప్రచురించలేదు? పేద ప్రజల జీవితాలు ఏమైతేనేం అనుకున్నారా? శేఖర్ గుప్తా కంటే మేధా పాట్కర్ చాలా చిన్న వ్యక్తి అంత ప్రాధాన్యత అవసరం లేదనుకున్నారా? లేక తమ రాజకీయ అవసరాలకు ఆమె వ్యాఖ్యలు వ్యతిరేకం కాబట్టి ఆ వార్తలు జిల్లా పేజీల్లో వేసి, తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా ఉన్న శేఖర్ గుప్తా వ్యాఖ్యలు ప్రముఖంగా వేసుకున్నారా?
బహుళ పంటలతో కళకళలాడుతున్న భూములను కాంక్రీట్ జంగిల్ గా మార్చొద్దని, అది తప్పని శేఖర్ గుప్తా వంటి సీనియర్ జర్నలిస్టుకు తెలియదా? ఈ మీడియాకు తెలియదా? ఒక నగరానికి పళ్ళు, పూలు, ఆకుకూరలు, కూరగాయలు అందిస్తున్న ప్రదేశాన్ని విధ్వంసం చేస్తే ఆ నగరం వీటికోసం ఏ ప్రాంతంపై ఆధారపడవలసి వస్తుందనే ఆలోచన ఈ మీడియా ఎందుకు ఆలోచించలేదు? ఈ శేఖర్ గుప్తా వంటి సీనియర్ జర్నలిస్టు సామజిక బాధ్యతగా ఎందుకు ఆలోచించలేదు? అలోచించి చెప్పిన వారిని ఎందుకు సమర్ధించలేదు? పంట పొలాలు ధ్వంసం చెయ్యొద్దని చేసిన విజ్ఞప్తులు, హెచ్చరికలు ఎందుకు పతాక శీర్షికలుగా రాలేదు?
ఢిల్లీ నుండి వచ్చిన పలువురు ప్రముఖ వ్యక్తులు (Prof. Vikram Soni, adviser to the Delhi Jal Board, Sachin Jain of the Indian Society of Landscape Architects, Romi Koshla, well-known architect) అమరావతికి ప్రత్యామ్నాయంగా నదీతీర ప్రాంతాన్ని వదిలేసి అవే 29 గ్రామాల్లో గట్టినేలల్లో తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించుకోవచ్చు అని చెప్పిన విషయానికి ఆనాడు ఈ మీడియా ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు? వారు సింగపూర్ లాగ కన్సల్టేషన్ ఫీజు కూడా లేకుండా ఒక ప్రణాళిక తయారు చేసి ఇస్తే ఆ వార్త పతాక శీర్షిక ఎందుకు కాలేదు? వారిచ్చిన ప్రత్యామ్నాయ నగర ప్రణాళిక ఎందుకు కనీసం ప్రజలకు చూపించే ప్రయత్నం చేయలేదు? అది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, అమరావతి ప్రజలకు లాభం చేకూరేది కాదు అనుకున్నారా లేక తమ రాజకీయాలకు అనుకూలంగా లేదు అనుకున్నారా? ఇప్పుడు శేఖర్ గుప్తా చెప్పింది తమ రాజకీయాలకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇంత ప్రముఖంగా, ఇంత ప్రాధాన్యత ఇచ్చారా?
శివరామకృష్ణన్ కమిటీలో నిపుణులకంటే శేఖర్ గుప్తా ఈ అంశాల్లో నిపుణుడు అని ఈ వార్త ప్రముఖంగా తీసుకున్నారా లేక తమ రాజకీయ అవసరాలకు అనుకూలంగా ఉందని పతాక శీర్షికలో ప్రచురించుకున్నారా?
వ్యవసాయ కూలీలుగా బ్రతుకుతున్న వేలాదిమంది రోడ్డున పడ్డప్పుడు, గొఱ్ఱెలు, మేకలు మేపుకుంటూ బ్రతుకుతున్నవారు, పాడిగేదెలు మేపుకుంటూ బ్రతుకుతున్న వారు, అక్కడ పండే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అమ్ముకుంటూ బ్రతుకుతున్నవారు… ఇలా బడుగు జీవులు ఎంతమంది ఏడ్చినా ఆనాడు పట్టించుకోని ఈ మీడియా, ఈ శేఖర్ గుప్తా ఇప్పుడెందుకొచ్చారు? ఎవరి రాజకీయం కోసం ఈ ప్రకటనలు… ఈ పతాక శీర్షికలు?
తమకున్న పాతిక సెంట్ల పొలంలో 20 సెంట్లే మాదంటున్నారు, ఐదు సెంట్ల భూమి పెద్దరైతు పేరున సీఆర్డీఏ అధికారులు రాసేశారు అంటూ డజన్లకొద్దీ నిరుపేదలు ఆక్రందనలు చేసినప్పుడు వారి ఆవేదన పతాక శీర్షికలుగా పనికిరాలేదా? రెండు సెంట్లు, మూడు సెంట్లు, ఐదు సెంట్లు, పది సెంట్లు చొప్పున బడుగు, బలహీన వర్గాల వారినుండి సీఆర్డీఏ అధికారుల సహాయంతో లాక్కొని తమ పేరున రిజిస్ట్రేషన్లు చేసుకుంటుంటే రోడ్డెక్కి ఏడవలేక ఇళ్ళల్లోనే కుమిలి కుమిలి ఏడ్చిన బడుగు జీవుల ఏడ్పుల చరిత్ర ఈ మీడియాకు పతాక శీర్షికగా కనిపించలేదు. వారి ఏడుపు శేఖర్ గుప్తా వంటి మేధావులకు వినిపించ లేదు. ఇప్పుడు ఎకరం ఐదు లక్షల రూపాయల పొలాన్ని ఐదు కోట్లకు అమ్ముకొని ఇంకో ఐదుకోట్ల వచ్చే అవకాశం పోయిందని రోడ్డెక్కినవారు కనిపిస్తున్నారా? వ్యవసాయం ఎప్పుడో మానేసి భూములు కౌలుకు ఇచ్చి, కౌలురైతు పంటలు పండిస్తుంటే, తమ గ్రామలోనో, విజయవాడలోనో, బెంగుళూరులోనో, అమెరికాలోనో కూర్చొని కౌలుసొమ్ము వసూలు చేసుకోవడం కష్టంగా ఉంది అని భావించి అప్పటి ప్రభుత్వం అడిగిందే తడవుగా భూములిచేసిన వారి వేదనలే పతాక శీర్షికలు అవుతాయా? కౌలుకిస్తే వేలల్లోనే వస్తోంది… అమ్ముకుంటే లక్షల్లోనే వస్తోంది అని ఆలోచిస్తున్న సమయంలో సీఆర్డీఏ వచ్చి కోట్లల్లో డబ్బులొచ్చే అవకాశం కల్పిస్తే అనుభవించి ఇంకా కొన్ని కోట్లు వస్తాయని ఆశించి ఇప్పుడు మోసపోయాం అని రోడ్డెక్కిన వారి వేదనలే పతాక శీర్షికలు అవుతాయా?
“అయ్యా మిమ్మల్ని, మీ భూముల్ని నమ్ముకొని బ్రతుకుతున్నాం. ఇప్పుడు మా బ్రతుకులేం కావలి. కాస్త మాకు తోడు రండి ప్రభుత్వంతో మాట్లాడదాం” అని వేలాది మంది కూలీలు, వందలాదిమంది కౌలు రైతులు మొరపెట్టుకుంటే స్పందించని రైతులు, పట్టించుకోని మీడియా, మాట్లాడని శేఖర్ గుప్తాలు ఇప్పుడు అదే రైతులు రోడ్డెక్కగానే స్వరం ఎందుకు పెంచుతున్నారు? పతాక శీర్షికలు ఎందుకు అవుతున్నాయి.
వాస్తవాలకు, ప్రజలకు, నిజాలకు దూరంగా, రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే మెదడు ఉపయోగించడం అణుయుద్ధం కంటే ప్రమాదం. అలాంటి ప్రమాదాలను నివారించవలసిన మీడియా, మేధావులు వాటిని ప్రోత్సహించడం దురదృష్టకరం.
దారా గోపి