ముందు లీకులు.. తర్వాత లుక్కులు..!

ముందు లీకులివ్వడం, తర్వాత ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం ఇండస్ట్రీకి కొత్త కాదు. తాజాగా సుధీర్ బాబు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. హర్షవర్థన్ దర్శకత్వంలో మామా మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు…

ముందు లీకులివ్వడం, తర్వాత ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేయడం ఇండస్ట్రీకి కొత్త కాదు. తాజాగా సుధీర్ బాబు సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. హర్షవర్థన్ దర్శకత్వంలో మామా మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు సుధీర్ బాబు.

ఈ సినిమాలో 3 డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు. వీటిలో ఒక గెటప్ పేరు దుర్గ. కాస్త బొద్దుగా కనిపించే లుక్ ఇది. ఈ లుక్ కు సంబంధించి నిన్ననే వీడియో ఒకటి లీక్ అయింది. భారీ కాయంతో సుధీర్ బాబు నడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చోవడం, సిగ్గుపడుతూ విలనీ నవ్వు నవ్వడం ఆ వీడియోలో కనిపించింది.

ఆ వీడియో లీక్ అయిన కొన్ని గంటలకే మామా మశ్చీంద్ర నుంచి దుర్గ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఆల్రెడీ లీక్ అయింది కాబట్టి హుటాహుటిన రిలీజ్ చేశారా లేక ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కోసం ముందే లీక్ చేసి హంగామా చేశారా అనేది యూనిట్ కే తెలియాలి.

ఈ సంగతి పక్కనపెడితే.. ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సుధీర్ బాబు, దుర్గ పాత్రతో మరోసారి ప్రయోగం చేస్తున్నట్టు కనిపిస్తోంది. 150 కిలోల బరువుండే పాత్ర ఇది. ఎప్పుడూ ఫిట్ గా కనిపించే సుధీర్ బాబు ఇలా లావుగా కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ సినిమాలో మరో 2 పాత్రలు కూడా ఉన్నాయి. వీటిలో ఒక పాత్ర పేరు పరశురామ్ కాగా, మరొకటి డీజే క్యారెక్టర్. ఈ రెండు లుక్స్ కూడా మరో వారం రోజుల్లో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. ఈ పాత్రలన్నీ వేటికవే భిన్నంగా ఉంటాయి. ఇలాంటి 3 విభిన్న పాత్రల మధ్య జరిగే కథ ఏంటనేది ఆసక్తికరం.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు చైతన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తాజా చిత్రం హంట్ ఫ్లాప్ అవ్వడంతో, మామా మశ్చీంద్రపై చాలా హోప్స్ పెట్టుకున్నాడు సుధీర్ బాబు.