కొత్త బాస్ చంద్రబాబునాయుడి మెప్పు కోసం మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తాపత్రయ పడుతున్నారు. బీజేపీలో ఉన్నంత వరకూ అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడుతూ పబ్బం గడుపుకున్న కన్నా… ఇటీవల టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ఆయన ఉత్సాహం చూపుతున్నారు. తన చేరికతో కాపులంతా టీడీపీ వైపు మొగ్గు చూపుతారనే బిల్డప్ ఇవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ముఖ్యమంత్రి జగన్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
అసలైన ఆ ఇద్దరు నేతలు మినహాయించి, కొసరు నేతలంతా స్పందించడం ఆసక్తికర పరిణామమని చెప్పొచ్చు. ‘ 175 నియోజక వర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా? వాళ్లకు ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు వాళ్లు మంచి చేసిన దాఖలాలే లేవు’ అని మంగళవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ అన్నారు. జగన్ సవాల్‌పై వాళ్లిద్దరూ స్పందించకుండా, టీడీపీ, జనసేన నేతలు ఎవరెవరో స్పందిస్తుండడం ఆశ్చర్యం కలుగుతోంది.
జగన్ సవాల్‌పై కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, పొంతన లేకుండా మాట్లాడారు. జగన్‌కు దమ్ము, ధైర్యం వుంటే ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా రావాలని కన్నా సవాల్ విసిరారు. అలాగే పోలీసులతో పాలన చేయడమా జగన్ దమ్ము, ప్రతిపక్షాల నోరు నొక్కడమేనా జగన్ దమ్ము అని ఆయన నిలదీశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడమా సీఎం జగన్ ధైర్యమని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ ఏదైనా కార్యక్రమం చేస్తే రాత్రికి వాళ్ల ఆస్తులు తగలబెట్టడమా ధైర్యం అని ఆయన ప్రశ్నించారు. కులం, మతం చూడకుండా పాలన చేశానని ప్రజలను ఓట్లు అడిగే దమ్ము ఉందా? ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే విమర్శలు, సవాళ్లు అని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఈ మాటలన్నీ చంద్రబాబు మెచ్చుకోలు కోసమే తప్ప, మరెందుకూ పనికి రావని కన్నాకు కూడా బాగా తెలుసు.
కన్నా లక్ష్మీనారాయణ అన్నీ మాట్లాడి… చివరికి 175 నియోజక వర్గాల్లో పోటీ చేసే దమ్ము, ధైర్యం వుందా? అనేది మాత్రం చెప్పలేదు. బహుశా అదొక్కటీ అడక్కు? అనే సినిమా డైలాగ్‌ను టీడీపీ, జనసేన నేతలు వైఖరి వుంది.