చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నెత్తిన నారా లోకేశ్ పాలు పోశారు. పాదయాత్రలో భాగంగా ఆయన ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో 400 కిలోమీటర్ల మైలురాయిని ఆయన చేరుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ ప్రసంగిస్తూ చెవిరెడ్డి, ఆయన తమ్ముడు, అనుచరులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అయితే చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని పేరు ప్రకటించి, చెవిరెడ్డికి గిఫ్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా పులివర్తి నానీనే పోటీ చేసి చెవిరెడ్డి చేతిలో ఓడిపోయారు. చెవిరెడ్డి 40 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన సంగతి తెలిసిందే. 24 గంటలూ రాజకీయాలను శ్వాసించే చెవిరెడ్డిని ఎదుర్కోవడం పులివర్తికి అంత సులువు కాదు. ఈ దఫా చంద్రగిరిలో గల్లా కుటుంబ సభ్యులు పోటీ చేస్తారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది.
మాజీ మంత్రి గల్లా అరుణ లేదా ఆమె కుమారుడు జయదేవ్, కుమార్తె డాక్టర్ రమాదేవిలలో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే చర్చ కొంత కాలంగా విస్తృతంగా సాగుతోంది. నిజానికి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజల్లో చెవిరెడ్డిపై సానుకూల వైఖరి ఉన్నా, నాయకుల్లో మాత్రం వ్యతిరేకత వుంది.
టీడీపీ తరపున సరైన నాయకులొస్తే, అటు వైపు వెళ్లాలనే ఆలోచనలో చాలా మంది నాయకులున్నారు. గల్లా కుటుంబం బరిలో నిలిస్తే… టీడీపీలో దూకడానికి చాలా మంది రెడీ అవుతున్న తరుణంలో పులివర్తి నాని అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ తిన్నారు. దీంతో మళ్లీ చెవిరెడ్డికి సానుకూల వాతావరణం ఏర్పడింది.
చెవిరెడ్డిని ఎదుర్కోవడం పులివర్తి వల్ల కానేకాదనే నిర్ణయానికి ఆ నియోజకవర్గ నాయకులు వచ్చారు. దీంతో చెవిరెడ్డితో కలిసి నడవక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పులివర్తి అభ్యర్థిత్వాన్ని ప్రకటించి లోకేశ్ తప్పు చేశారనే భావన నెలకుంది. చెవిరెడ్డిని లోకేశ్ తిడితే తిట్టారు కానీ, ఆయనకు మంచే చేశారని వైసీపీ శ్రేణులు సరదా కామెంట్స్ చేస్తున్నాయి. చెవిరెడ్డి నక్క తోక తొక్కారని, అందుకే ఆయన ప్రత్యర్థి పులివర్తి అయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.