నిషేధిత భూముల విషయమై తిరుపతి ప్రజానీకం హాయిగా ఊపిరి తీసుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. గత నెలాఖరులో 2,300 ఎకరాల భూమిని టీటీడీ అధికారుల వినతి మేరకు ఎండోమెంట్‌లో చేర్చారు. ఎండోమెంట్ కమిషనర్ సూచన మేరకు రిజిస్ట్రేషన్ శాఖ నిషేధిత జాబితా (22ఎ)లో చేర్చింది. ఇందులో వేలాది మంది ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేకపోవడంతో నగర ప్రజానీకం లబోదిబోమంది.
ఈ విషయమై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వెంటనే స్పందించారు. వెంటనే ఆయన టీటీడీ, ఎండోమెంట్, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడారు. తప్పును సరిదిద్దుకునేందుకు ఎండోమెంట్ కమిషనర్‌కు టీటీడీ తిరుపతి జేఈవో లేఖ రాశారు. ఆ లేఖపై ఎండోమెంట్ కమిషనర్ వెంటనే స్పందించారు. రిజిస్ట్రేషన్, స్టాంప్స్ విభాగపు ఉన్నతాధికారికి తిరుపతి భూముల విషయమై లేఖ రాశారు.
తిరుపతి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఇచ్చిన నిషేధిత జాబితాను వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. రిజిస్ట్రేషన్‌కు ఇబ్బంది లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని, సంబంధిత సమాచారాన్ని మెయిల్ ద్వారా పంపాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఎమ్మెల్యే కోరారు. ఇకపై రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే అన్నారు.
ఇదిలా వుండగా వారం క్రితం తలెత్తిన సమస్యను పరిష్కరించే బాధ్యత తనదే అని ఆయన భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఉన్నట్టుండి ఏమైందో తెలియక అయోమయానికి లోనయ్యారు. అలాంటి వారందరి సమస్యకు చక్కటి పరిష్కారం తక్కువ సమయంలోనే దొరికింది. రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది లేకుండా చేస్తానన్న హామీని తిరుపతి ఎమ్మెల్యే నిలబెట్టుకున్నారు.